గుంటూరు (చైతన్యరథం): సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడిరచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కస్టడీలో ఆయన్ని చిత్రహింసలకు గురిచేసి, అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. తులసిబాబును గుంటూరు కోర్టు మూడురోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే, తులసిబాబు తానే తప్పు చేయలేదని చెబుతుండడంతో, నిందితుడ్ని గుర్తించేందుకు ఆదివారం గుంటూరులో ఐడెంటిఫికేషన్ పరేడ్ ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. తన ముందు ప్రవేశపెట్టిన కొందరు వ్యక్తుల్లో ఆయన నిందితుడ్ని గుర్తించారు.
పరేడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం సమన్లతో కోర్టుకు వచ్చినట్లు చెప్పారు. నా గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించా. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడ్ని గుర్తించానని తెలిపారు.
ఈ పరేడ్‌లో తన ముందు ఏడుగురిని ప్రవేశపెట్టారని, వారిలో… ఆ రోజు తన ఛాతీపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని రఘురామ స్పష్టం చేశారు. సుమారు గంటపాటు ఈ పరేడ్ జరిగిందని, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చానని వివరించారు. సరైన వ్యక్తినే గుర్తించినట్లుగా భావిస్తున్నానని చెప్పారు. నేను గుర్తించిన వ్యక్తి (తులసిబాబు)చరిత్ర గుడివాడ వాళ్లకే కాదు, పక్కనున్న ప్రకాశం జిల్లా వాళ్లకు కూడా తెలుసు. తులసిబాబుకు కొందరు మద్దతివ్వడం అందరికీ తెలుసు. అతడికి, టీడీపీకి సంబంధం లేదని గుడివాడ వాసులు చెప్పారు. అప్పట్లో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ రూమ్ లోకి వెళ్లాలంటే ఎవరైనా పర్మిషన్ తీసుకుని వెళ్లాలి… కానీ, ఇతడు డైరెక్ట్‌గా డోర్ తీసుకుని వెళ్లేవాడు! సునీల్ కుమార్ రూమ్ లోకి ఇతడు ఎంటరైతే, అప్పటికే లోపల ఎవరైనా ఆఫీసర్లు ఉంటే వారు బయటికి వచ్చేయాలి… ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు… సునీల్‌కుమార్‌కు అత్యంత ఆత్మీయుడని సీఐడీ ఆఫీసంతా చెప్పుకునేవారు. పైగా, ఇతడ్ని లీగల్ అడ్వైజర్ గా కూడా తీసుకున్నట్టు పేపర్లో కూడా వచ్చింది. అతడు దరఖాస్తు చేసుకున్నాడట… మరి సునీల్ కుమార్ ఇతడి క్వాలిఫికేషన్ చూశాడో, ఇతడి పర్సనాలిటీ నచ్చిందో కానీ సెలెక్ట్ చేశాడు’’ అని వివరించారు.