- సమస్యలపై స్పందించే విద్యామంత్రి రావడం అదృష్టం
- షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి అచ్చెన్న
- గిరిజన పాఠశాలలో చదివి మంత్రిస్థాయికి చేరానన్న సంధ్యారాణి
- అభివృద్ధిలో వెనుకబడ్డా విద్యలో ముందున్నామన్న బోనెల
పార్వతీపురం (చైతన్యరథం): మరో ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు సిఫారసు చేయించుకునే పరిస్థితి వస్తుంది.. ప్రభుత్వ విద్యను మరింత ముందుకు తీనుకెళ్లడానికి కలసికట్టుగా పనిచేద్దామని పార్వతీపురం మన్యం జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో సోమవారం జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఎపిలో చిట్టచివరి, అత్యంత వెనుకబడిన జిల్లా పార్వతీపురం మన్యం అన్నారు. ఎక్కువగా గిరిజనులు నివసించే జిల్లా. షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఈ జిల్లాను ఎంపిక చేసుకున్నందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను అభినందించాలి. గత పాలకులకు ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచన ఎన్నడూ రాలేదు.
టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మన్యం జిల్లాకు రాష్ట్రంలో ప్రథమస్థానం వస్తుందని ఎవరూ ఊహించరు. విద్యద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారమని గుర్తించి ఎన్‌టిఆర్, చంద్రబాబు, లోకేష్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. కష్టమైన విద్యాశాఖను పట్టుబట్టి తీసుకున్నారు లోకేష్. గత ప్రభుత్వం సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు, ఎవరినీ వారి సమస్యలు చెప్పుకోనీయలేదు. ఇప్పుడు ప్రతిఒక్కరికీ స్వేచ్చ ఇచ్చారు. వైసీపీ అయిదేళ్ల పాలన వల్ల రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి, తీవ్ర నష్టం జరిగింది. వ్యవస్థలు కుప్పకూలాయి. అభివృద్ధి కుంటుపడిరది. కష్టాలతో ప్రయాణం ప్రారంభించి ముందుకెళ్తున్నాం. సమస్యలపై స్పందించే మంత్రి దొరకడం అదృష్టం. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపని విధంగా విద్యార్థులకు మంచి యూనిఫాం డిజైన్ ఇచ్చారు. గత అయిదేళ్లలో దుర్మార్గ పాలకులు నాడు-నేడు పేరుతో రూ.4,500 కోట్లు దుర్వినియోగం చేశారు, భవనాలు పాడుచేశారు, అసంపూర్తిగా వదిలేశారు. డబ్బు ఖర్చుపెట్టి స్కూళ్లు ఎత్తేశారు. అనాలోచిత నిర్ణయాలతో చాలా సమస్యలు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
గిరిజన స్కూలులోనే చదివి ఈ స్థాయికి చేరా: మంత్రి సంధ్యారాణి
గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ… విద్యార్థులకు స్పూర్తినిస్తున్న మంత్రి లోకేష్ ఇక్కడకు రావడం తమ అదృష్టం అన్నారు. టెన్త్, ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందనలు. మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో పెనుమార్పులు తెచ్చారు. గతంలో చంద్రబాబు ప్రతి గ్రామానికి స్కూలు, మండలానికో కాలేజి ఉండేలా చర్యలు తీసుకున్నారు. గురుకుల విద్యాలయాలు అన్న నందమూరి తారకరామారావు భిక్ష. ఆయన వల్లే మా విద్యార్థులు చదువు కొనసాగించగలుగుతున్నారు. అభివృద్ధిలో వెనకబడ్డా విద్యలో మాత్రం మా విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. 8 గిరిజన మండలాల్లో ఫోన్ సిగ్నల్స్ సరిగా రావడం లేదు. ఇంటర్నెట్ సమస్య లేకుండా చూడాలని కోరుతున్నా. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో కడుపు నింపిన ఘనత లోకేష్ దే. జోగంపేట స్కూలులో ఇద్దరు ఐఐటి, ముగ్గురు ఎన్‌ఐటి సీట్లు సాధించారు. చదువుకుని సాధించాలన్న పట్టుదల మా విద్యార్థులకు ఉంది. ప్రోత్సహం ఇస్తే ఉన్నత స్థానానికి చేరుతారు. నేను గిరిజన స్కూలులో చదవుకొని ఈస్థాయికి వచ్చా. ప్రభుత్వ జూనియర్ కాలేజిలు తక్కువగా ఉన్నాయి, నియోజకవర్గానికి ఒక బాలికల జూనియర్ కాలేజి ఏర్పాటు చేయాలని మంత్రి సంధ్యారాణి కోరారు.
అభివృద్ధిలో వెనకబడ్డా విద్యలో ముందున్నాం: ఎమ్మెల్యే బోనెల
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ… పార్వతీపురం జిల్లా ఒరిస్సాకు ముఖద్వారం. తెలుగు, ఒరియా సంస్కృతులు ఇక్కడ ఉంటాయి. అభివృద్ధిలో మేం వెనుకబడ్డాం కానీ, చదువులో వెనుకబడలేదు. టెన్త్ లో గత మూడు సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన జిల్లాలను వెనక్కునెట్టి ముందువరుసలో నిలిచాం. మంత్రి లోకేష్ స్ఫూర్తితో టీచర్లను సత్కరించాం. ఇక్కడ ఎక్కువమంది ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లోనే చదువుతున్నారు. ప్రభుత్వపథకాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్న జిల్లా మాది. ఐఐటిలో మా ప్రాంత విద్యార్థికి 15వ ర్యాంకు వచ్చింది. మీ పర్యటనతో మాకు స్పూర్తినిచ్చారు. మీ అడుగు మా జిల్లా భవిష్యత్తు, జీవితాలను మార్చుతుందని నమ్ముతున్నాం. గతంలో టిడిపి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకులాలను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో మీ నేతృత్వంలో ప్రభుత్వస్కూళ్లు.. సీట్లకోసం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసేస్థాయికి ఎదుగుతాయని ఎమ్మెల్యే బోనెల విశ్వాసం వ్యక్తం చేశారు.
మంచి ఫలితాలు సాధించాం: కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ… అత్యధికంగా గిరిజన మండలాలు కలిగి వెనుకబడిన మా జిల్లాల్లో టెన్త్, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయి. ఇందుకోసం కృషిచేసిన ఉపాధ్యాయ బృందాలకు అభినందనలు. మా ప్రాంతంలో సగం గిరిజన మండలాలు ఉన్నాయి. ఎక్కువమంది ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతారు. లక్షలో 40శాతం సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇచ్చాం. ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు, వారికి భవితకార్డు ద్వారా తెలియజేశాం. మెగా పిటిఎం సక్సెస్ ఫుల్‌గా నిర్వహించామని చెప్పారు.