- 20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా తరలింపు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
- రెవెన్యూ, గనుల శాఖల విచారణలో బయటపడిన వాస్తవం
ఏలూరు (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో అనుమతులు లేకుండా భారీగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు జరిపినట్లు అధికారుల విచారణలో తేలింది. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం సాగించినట్లు గుర్తించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ దీపం 2 పథకం ప్రారంభం కోసం ఐ.ఎస్.జగన్నాథపురంలో పర్యటించారు. అక్కడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొండ సమీపంలో భారీగా ఎర్ర మట్టి తవ్వకాలు సాగించినట్లు కనపడటంతో ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ తవ్వకాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన అధికారులు నివేదిక సమర్పించారు.
నివేదికలో వివరాలివి…
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి విచారణ నివేదిక చేరింది. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలోని సర్వే నెంబర్ 425లో అనుమతులు పొందిన ప్రాంతంలో కాకుండా, ఎలాంటి అనుమతులు లేని 20.95 ఎకరాల్లో 6,15,683 క్యూబిక్ మీటర్ల రెడ్‌గ్రావెల్ తవ్వకం సాగించారు. అనుమతి ఉన్న చోట తవ్వకుండా మరో చోట తవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా తవ్విన రెడ్ గ్రావెల్ ను అనుమతి ఉన్న ప్రదేశాల నుంచి తవ్వినట్లు నమోదు చేసినట్లు గుర్తించారు. ఈ తప్పిదాలపై బెకెమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, గనుల శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు తెలియచేశారు. తవ్వకాలు సాగించిన ప్రదేశంలో భారీగా పచ్చదనం దెబ్బ తిని, జీవ వైవిధ్యానికి విఘాతం వాటిల్లిన విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ అంశంపైనా అటవీ శాఖ అధికారులను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.