- రాష్ట్ర తెలుగు మహిళ విసృతస్థాయి సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
- జగన్ అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు: హోంమంత్రి అనిత
- అవినీతిపై ప్రశ్నిస్తే ప్రసన్న మురికి వ్యాఖ్యలు: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
అమరావతి (చైతన్యరథం): ప్రజా జీవితంలో మహిళలను కించపరిచేలా అహంకారంతో వ్యవహరించే వారికి పుట్టగతులుండవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలుగు మహిళ విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లా శ్రీనివాస్,ం ాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు మనం అధికారంలో ఉన్నాం.. అయితే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పోరాటం చేయాల్సిందేనన్నారు. మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారు పుట్టగతులు లేకుండా పోతారనేది చరిత్ర చెబుతున్న మాట. మహిళలను అవమానించడం అనేది మన సంస్కృతికి విరుద్ధం. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల స్వేచ్ఛకు, గౌరవానికి పెద్ద పీట వేయాలి. మహిళలను కించపరిచే నేతలు రాజకీయంగా ఎంతటి శక్తివంతులు అయినా, ప్రజల తీర్పు ముందు చేతులెత్తక తప్పదు. చరిత్ర కూడా వారికి గుణపాఠం చెప్పకమానదు. నాయకత్వం అనేది ఎవరు ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచారన్నదానిపై ఆధారపడి ఉండదు. నిజమైన నాయకత్వం అంటే ప్రజల పట్ల వినయం, గౌరవం, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తన. చదువు, సంస్కారం, ప్రవర్తన.. ఇవే నాయకత్వాన్ని నిర్వచించాలి. మహిళల గౌరవాన్ని కాపాడడంలో ముందుండటమే నిజమైన ప్రజాప్రతినిధి ధర్మమని ఉద్ఘాటించారు.
జగన్‌రెడ్డిది క్రూర మనస్తత్వం: హోంమంత్రి అనిత
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కోటిక్కోటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో వాటికి అడ్డుతగిలే విధంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. కుట్రలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య.. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్త్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు లబ్ధి చేకూర్చి వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. దీపం `2 పథకాన్ని అమలు చేశాం. అగస్ట్ 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. పింఛన్ ను రూ.3000 నుంచి రూ.4000కు పెంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అమలు చేస్తు వస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చితే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి మీద ఉక్కు పాదం మోపేందుకు ‘‘ఈగల్’’ టీంను ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమిలో భాగంగా మనం జనసేన, బీజేపీతో కలిసి పని చేయాలి.. ఎందుకంటే గతంలో ఒక రాక్షసుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఒక అవతారంగా మారి రాక్షసుడిని అంతమొందించేవారు. అదేవిధంగా ఐదేళ్ల పాటు మూడు పార్టీలు కలిసి ఒక రాక్షసుడితో యుద్ధం చేశాయి. అధికారంలోకి వచ్చాం… దానిని అలా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మహిళా నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడున్న నామినేటెడ్ పదవుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కి విన్నవించుకుంటున్నా. జగన్ రెడ్డి క్రూరమైన మానసత్వం కలిగిన వ్యక్తి. ఐదేళ్ల పాలనలో ఒక రకమైన క్రూరత్వం చూపించాడు.. ఓడిపోయిన తరువాత మరో విధమైన క్రూరత్వం చూపిస్తున్నాడు. పూర్తిగా మహిళలనే టార్గెట్ గా పెట్టుకుని దాడులు చేయించడం.. మురికి వ్యాఖ్యలు చేయించడం.. లాంటివి చేస్తున్నాడు.. అందులో భాగంగానే కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద ప్రజలు మాట్లాడుకునేందుకు సిగ్గుపడేలా.. అతని పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నాడు. జగన్ రెడ్డి పాల్పడుతున్న అన్ని అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్ రెడ్డి ఎన్ని మాయలు, కుట్రలు, కుతంత్రాలు చేసిన మళ్లీ అధికారంలోకి రావటం అనేది అయనకు కలగానే మిగిలిపోతుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
మురికి వ్యాఖ్యలకు జగన్ సమర్థింపు దారుణం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఒక నాయకుడు గెలిచినా.. ఓడినా.. ఏ పార్టీలో ఉన్నా… తనను నమ్ముకున్న ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని న్యాయం చేసే విధంగా ఉండాలన్నారు. అది ఒక నాయకుడి లక్షణం. గత ప్రభుత్వ పాలనలో అవినీతి చేసినప్పుడు.. దానిని ప్రశ్నించే హక్కు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకు ఉంటుంది. నేను అదే పని చేస్తే దానికి వారు సమాధానం చెప్పలేక.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌గా చేసుకుని, చెల్లెలు వరుస అవుతానని కూడా చూడకుండా నాపై సభ్యసమాజం సిగ్గుపడే విధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మురికి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నాయకులను జగన్ రెడ్డి ఎందుకు వెనకేసుకువస్తున్నారో అర్థం కావటం లేదు. అసలు మహిళలపై ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడావ్ అని ప్రశ్నించాల్సింది పోయి.. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి గురించి మాట్లాడుతున్నాడంటే జగన్ ఆలోచన తీరు ఎలా ఉందో మనకి అర్థం అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు అన్యాయం జరిగితే.. తన బిడ్డకు అన్యాయం జరిగినట్లుగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, నారా భువనేశ్వరి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అందరు కలిసి నాకు రక్షణ కవచం లాగా నిలిచారు. ఈ విషయంపై జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు.