- నా తపనంతా సంపూర్ణ మహిళా సాధికారత కోసమే..
- ఇప్పుడు దక్కుతున్న గౌరవానికి నాంది గత పొదుపు ఉద్యమమే
- మహిళలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలన్నదే నా సంకల్పం
- అందుకు మీ సంపూర్ణ సహకారం అవసరం
- ఊళ్లో కూర్చునే డబ్బు సంపాదించే విధానాలు తీసుకొస్తా
- మహిళా దినోత్సవాన ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
ప్రకాశం (చైతన్య రథం): ‘ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుంటే చులకనగా చూసే ప్రమాదముంటుంది. అందుకే ఆర్థికంగా సమాజంలో పైకి తెచ్చేందుకు, ఆడబిడ్డల గౌరవాన్ని ఇనుమడిరప చేసేందుకు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మహిళా సాధికారత సాధనను పొదుపు ఉద్యమంతో ప్రారంభించాననని గుర్తు చేశారు. గతంలో ఎన్నో సమావేశాలు నిర్వహించి మహిళలతో మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆనాడు మొదలుపెట్టిన పొదుపు ఉద్యమం ఎన్నో ఫలితాలిచ్చిందని, మహిళలు తమ పిల్లలను చదివించుకుంటున్నారని, చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నారని అన్నారు. అలా సమాజంలో మహిళల గౌరవం పెరిగిందన్నారు. ఇళ్లలో మహిళలను గౌరవిస్తున్నారంటే ఆనాడు తాను ఆలోచించిన విధానమే కారణమన్నారు. మహిళలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తానని భరోసానిస్తూ.. మహిళలు తమ ఊళ్లలోనే కూర్చుని డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
డ్వాక్రా సంఘాలు, మెప్మా సంఘాల వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా కృషి చేస్తానన్నారు. అందుకు మహిళలు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆడబిడ్డల కష్టం తీర్చేందుకు దీపం పథకం తెచ్చామన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తులుగా తయారు చేస్తామన్నారు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 ఇస్తామన్నారు. ఐదుగురు పిల్లలున్నా.. 60వేలు ఇస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వోద్యోగులకు కూడా ఎన్నిసార్లు అయినా మెటర్నిటీ సెలవులు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదని హామీనిస్తూ.. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిరదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్
‘నా కుటుంబంతోపాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరి డెవలప్ చేశారు. నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశా. ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్. అదే మీకు చివరి రోజు అవుతుంది. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం. గత ఐదేళ్లు మహిళలు స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి లేదు. మహిళలను బలవంతంగా మీటింగ్‌కు తీసుకువచ్చి బయటకు వెళ్ళకుండా చుట్టూ గుంతలు తీసిన దృశ్యాలు చూశాం. మహిళలు ఇంటినుంచి పని చేసేందుకు గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెడతాం. కంపెనీలు తీసుకువచ్చే బాధ్యత నాది… పని చేసే విధానం మీది’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అప్పుడు వద్దన్నాను.. ఇప్పుడు కనండి..
చైనా, జపాన్‌లో జనం సంఖ్య తగ్గిపోతోందని.. సంపాదించింది అనుభవించడానికి కూడా వారసులు లేకుండా పోతున్నారన్నారని వివరించారు. గతంలో ఒక్కరినే కనమని చెప్పానని.. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మందిని కనమని చెబుతున్నానని అన్నారు. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం లేకుండా చట్టం చేశామని.. ఇప్పుడు ఇద్దరికంటే తక్కువ ఉంటే పోటీ చేసే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విజన్ 2020 ఇచ్చి హైదరాబాద్ డెవలప్ చేశామని గుర్తు చేస్తూ.. 2047కు ప్రపంచంలో అగ్ర దేశంగా భారతదేశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండాలన్నారు. మహిళల కోసం 45శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చామని చెబుతూ.. ఏ ప్రభుత్వ సేవనైనా వాట్సాప్ గవర్నెన్స్‌లో పొందవచ్చన్నారు. వాట్సాప్ ద్వారా 200 సర్వీసులు ఆన్‌లైన్‌లో పెట్టామని… రాబోయే రోజుల్లో వెయ్యి సర్వీసులకు విస్తరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మార్కాపురంలో 14,705 స్వయం సహాయక సంఘాలకు రూ.1,826.43 కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు. స్త్రీనిధి రుణాలు పంపిణీ కోసం వెయ్యి కోట్ల చెక్కు అందజేశారు. ఆపై 100మంది మహిళల విజయ గాధ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్‌ను ప్రారంభించారు. చేనేత రథం, ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని మొదలుపెట్టారు. మార్కాపురంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పరిశీలించారు.