- పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు
- గత పాలకమండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు
- గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు
- రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాలి
- ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
- శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్
అమరావతి (చైతన్యరథం): ‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి. నాటి పాలకమండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన ఆలయాల పాలకమండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సూచించారు. శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన గిరి ప్రదక్షిణ మార్గాన్ని శుక్రవారం ఆయన వెలగపూడిలోని సచివాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ మాట్లాడుతూ “మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయి.
అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు. నాకు గిరి ప్రదక్షిణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాను. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నాం. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.
శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటతాం
శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రూ.10 కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్డు నిర్మించాం. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మార్గానికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికీ కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో మన సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూ.. ఆలయాలను, ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా దేవదాయ శాఖ సహకారంతో ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్న కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును 3కోట్ల 70లక్షల వ్యయంతో చేపట్టాం. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ పరిసరాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇటీవల కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డును సుమారు రూ.4 కోట్లతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి సాస్కీ నిధులు రూ.6కోట్లు మంజూరు చేశాం.
ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులతో రూ.40 కోట్లకు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్డు వసతి కల్పిస్తున్నాం. మరెన్నో చిన్న ఆలయాలకు రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని సూచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది’ అని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుంచి వర్చువల్గా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్ సెల్వం, డీఎఫ్వో సాయిబాబా, శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.












