- కుప్పం పర్యటనలో ఉన్న భువనేశ్వరిని ఇంటికి ఆహ్వానించిన లక్ష్మమ్మ
- కుటుంబసభ్యులను ఆపాయ్యంగా పలకరించి అల్పాహారం తీసుకున్న భువనేశ్వరి
కుప్పం (చైతన్యరథం): అనుకోకుండా ఆ ఇంటికి ప్రత్యేకమైన అతిథి వచ్చారు. సాదాసీదా అతిథి కాదు. ఆ కుటుంబం మొత్తం దేవుడిలా ఆరాధించే అధినాయకుడి సతీమణి ఆమె. ఒక్కసారిగా ఇంటికి వచ్చిన ప్రత్యేక అతిథిని చూసిన ఆ కుటుంబం మొత్తం తొలుత సంభ్రమానికి గురై.. వెంటనే పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ ఇల్లు టీడీపీ మహిళా కార్యకర్తది. వచ్చిన అతిథి సాక్షాత్తూ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి పర్యటనలో నారా భువనేశ్వరిని కలిసిన లక్ష్మమ్మ అనే బీసీ మహిళ తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించింది. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి శుక్రవారం లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఆనందాశ్చర్యాలకు గురి చేశారు. తాము ఎంతో ఆరాధించే బాబన్న భార్య భువనమ్మ తమ ఇంటికి రావడంతో లక్ష్మమ్మ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. భువనేశ్వరిని సాదరంగా స్వాగతించి చీరను బహుకరించారు. వారి యోగక్షేమాలు కనుక్కుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్పాహరం తీసుకుని శాంతిపురంలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు.













