- వైసీపీ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా వర్శిటీలు
- పరిస్థితిని సమూలంగా మార్చేస్తున్న లోకేష్
- పలు సంస్కరణలతో విద్యావ్యవస్థ బలోపేతం
- ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
అమరావతి (చైతన్యరథం): వైసీపీ పాలనలో 2019-24 మధ్య కాలంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడిలో పెడుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారవ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక విద్య, కళాశాల విద్య, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు.. అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడని ధ్వజమెత్తారు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాటన్నిటినీ గాడిలో పెడుతున్నారు. జగన్ జీవో నెంబర్ 117 ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేశారు. లోకేష్ ఆ జీవో నెంబర్ 117 ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజల దరిచేరే విధంగా చేశారు. మంచి విలువలతో కూడిన విద్యను అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని బలోపేతం చేస్తున్నారు.
రాష్ట్రంలోని మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థనే దేశం మొత్తం చూసే విధంగా లోకేష్ తీర్చిదిద్దారు. ఇంటర్మీడియట్ విద్యను కూడా జగన్ సర్వనాశనం చేశాడు. గతంలో ఉండిన మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశాడు. లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి అమలు చేశారు. దీంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే అవకాశం కలిగింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నిటినీ తన బంధువుల కోసం, తన పార్టీ వారి కోసం రాజకీయ పునరావాస కేంద్రాలుగా జగన్ మార్చేశారు. జగన్ తన సమీప బంధువైన సుందరవల్లిని నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా, తన అనుంగ అనుచరుడైన రామకృష్ణారెడ్డిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వైసీపీ అభిమాని, తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా, కడపలో 2020 సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సురేంద్రనాథ రెడ్డిని వైస్ ఛాన్సలర్‌గా నియమించుకున్నారు. తన బంధువులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వాళ్లకు ఉపాధి చూపించడం కోసం విశ్వవిద్యాలయాలను ఆయన వాడుకున్నారు. కానీ లోకేష్ మంత్రి అయిన తర్వాత విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వాడుకోకూడదని చెప్పి, నూతన ఆలోచనతో దేశంలో పేరెన్నిక గన్న ప్రొఫెసర్లను, ఉన్నత విద్యావంతులను, అర్హులైనవారిని మాత్రమే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నారు. లోకేష్‌కు విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంది. 16,324 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో కేవలం 5000 మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అబద్ధపు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం నేడు 16 వేల పై చిలుకు టీచర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ కూడా పూర్తికావచ్చింది. ఆగస్ట్ లోపలే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేసి పాఠశాల విద్యను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2020లో తన బావమరిదిని వీసీగా నియమించుకునేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా జగన్‌రెడ్డి కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకొని ప్రారంభించాలి. కానీ జగన్ అలా చేయలేదు. కడపలోని ఆర్కిటెక్చర్ కాలేజీకి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వాటిని ప్రారంభించడంతో విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఆ యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికెట్లు దేశంలో ఎక్కడా కూడా చెల్లవు. దీంతో తమ భవిష్యత్‌పై గత 10, 15 రోజులుగా కడపలోని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఇటీవల విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టపర్తి పర్యటనకు వెళ్లినప్పుడు ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఆయనను కలిసి వారి సమస్యలను వివరించారు. భయాందోళలను అవసరం లేదని, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి అనుమతులు తీసుకొస్తామని వారికి మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్దికి సంబంధించి కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి సమీక్షలపై సమీక్షలు చేస్తున్నారుగానీ ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి అనుమతి తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో విద్యార్థులకు స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి డిమాండ్ చేశారు.
విద్యకు అత్యంత ప్రాధాన్యత
గతంలో వాడుతున్న ముతక బియ్యానికి బదులుగా నేడు సన్న సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు విద్యా వ్యవస్థపై సానుకూ దృక్పథం ఏర్పడేందుకు, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం, సత్సంబంధాలు ఏర్పడేందుకు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సమావేశాలు జరిగిన ఉదంతాలు లేవు. వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రోజు వేల పేరెంట్, టీచర్ సమావేశాలు జరిపించటం విద్యామంత్రి లోకేష్‌కే సాధ్యమైంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి రాష్ట్రంలోని విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లే విధానానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు అనేక విద్యా సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా బిట్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కాలేజ్, ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఎల్‌ఆర్‌ఐ, సివిల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ నేషనల్ క్వాంటం మిషన్ ఇలాంటి అత్యున్నత విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. 2026-27 లోపు భవనాల నిర్మాణాలు కూడా పూర్తి చేసుకొని రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.
అంతేకాకుండా వైసీపీ హయాంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌పౖౖె విద్యార్థులను ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి అధికారం నుండి దిగిపోయేటప్పుడు వేల కోట్ల రూపాయల రీయింబర్స్‌మెంట్ బకాయలు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1388 కోట్ల బకాయలను చెల్లించి విద్యార్థులకు మేలు చేకూర్చింది. 2019 కంటే ముందు ఉన్న ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయలను జగన్మోహన్ రెడ్డి చెల్లించని పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 640 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాం. ఏ కుటుంబమైనా సామాజికంగా, ఆర్థికంగా ముందుకు పోవాలంటే విద్య అత్యంత అవసరం. ఆ విద్య ప్రాధాన్యతను గుర్తించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం.. రాష్ట్రంలో విద్యార్థులకు అనేక రకాలైన సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు పోయినా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మంచి చదువులు చదువుకుని, మంచి ఉద్యోగాలు పొందుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు దూర దృష్టితో తీసుకున్న చర్యల కారణంగానే. అదేవిధంగా లోకేష్ విద్యామంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరంలో అనేక రకాల విద్యా సంస్కరణలు చేపట్టారని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తెలిపారు.