- కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు
- రూ.92 కోట్లతో కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి
- మదర్ డైరీ, శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో 8 వేలమందికి ఉద్యోగాలు
- టాటా సంస్థ సహకారంతో మెరుగైన వైద్య సేవలు
- 40 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాల
- కుప్పంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం
కుప్పం (చైతన్య రథం): ‘నన్ను గుండెల్లో పెట్టుకుని ఇంతవాణ్ణి చేసిన కుప్పం అభివృద్ధికి కంకణబద్దుడినై ఉన్నానని, అందుల భాగంగానే ‘స్వర్ణకుప్పం విజన్ -2029’ డాక్యుమెంట్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదరిక నిర్మూలన, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, అందరికీ విద్యవంటి 10 అంశాలకు విజన్ డాక్యుమెంటులో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కుప్పం రెండోరోజు పర్యటనలో మదర్ డెయిరీ, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు.
కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92 కోట్లు
‘2047నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం తయారుకావాలి. మరో మూడు నెలల్లో కుప్పానికి వస్తాను. కడా ఆధ్వర్యంలో కుప్పంలో చేపట్టే అభివృద్ధి పనులను నేను స్వయంగా పర్యవేక్షిస్తా. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92.22 కోట్లు మంజూరు చేశా. అందులో రూ.22 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెస్ నిర్మాణం పూర్తి చేస్తాం. గత ఐదేళ్లు ఈ ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. రూ.20 కోట్ల వ్యయంతో కుప్పంలో డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రూ.10 కోట్ల వ్యయంతో కుప్పంలో 10 జంక్షన్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రధాన రహదారులను సుందరీకరిస్తాం. విద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.3కోట్లు మంజూరు చేశాం. రూ.19 కోట్ల వ్యయంతో పార్కులను అభివృద్ధి చేయబోతున్నాము. కుప్పం నియజకవర్గంలో గుంతల రోడ్లు కనపడకూడదు. రహదారుల అభివృద్ధి, మరమ్మతులకు రూ.34.27 కోట్లు మంజూరు చేశాం. శాంతిపురం పరిధిలో మదర్ డెయిరీకి 41.21 ఎకరాలు ఇచ్చాము. రూ. 105 కోట్ల వ్యయంతో రాబోతున్న ఈ డెయిరీవల్ల 4 వేలమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో మరో 4 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. కుప్పం పరిధిలో రూ.22 కోట్ల వ్యయంతో ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. డ్వాక్రా ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాం. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో అలీప్ సంస్థ సహకారంతో మహిళలకు పలు ఉత్పత్తుల తయారీలో శిక్షణనివ్వడం ద్వారా వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
టాటా సహకారంతో మెరుగైన వైద్య సేవలు
కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తున్న కడా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కుప్పాన్ని టూరిజం హబ్‌గా మారుస్తా. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందులో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్టును కూచిపూడి నృత్యం థీమ్‌తో ఆధునీకరిస్తున్నాము. కుప్పం ప్రజలు కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాను. ప్రతి ఇంటిపై సోలార్ వెలుగులు రాబోతున్నాయి. కుప్పంలో కార్గో ఎయిర్ పోర్టు రాబోతోంది. ఇక్కడి ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకొస్తున్నాము. టాటా సంస్థ సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.