- అర్జీదారులకు మంత్రి లోకేష్ భరోసా
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్
- ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన వారికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్‌ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి
దేవాదాయ శాఖ కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న నాదస్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అఖిల భారత నాయిబ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సేవ, సంక్షేమ, జాతి ప్రక్షాళన సమితి ప్రతినిధులు.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం.. నాదస్వరం, డోలు, శృతి, తాళం నేర్చుకుని, వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై, డిప్లమో అర్హత కలిగిన పూర్వ విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతో పాటు వయస్సు సడలింపు ఇవ్వాలని కోరారు.
గత 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసం ఉంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటకు చెందిన గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య జిల్లా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటావూరులో 60 కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయని.. బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు త్వరతగతిన నష్టపరిహార నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు విన్నవించారు.
టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ పాలనలో తనపైన, తన కుటుంబంపైన 42 అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ కోరారు.
ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.














