- అంతర్గత విభేదాలతో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు..
- పార్టీకి నష్టం వాటిల్లితే సహించేది లేదు..
- నివేదిక కోరుతూ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశం
- సూపర్ సిక్స్ అమలు తీరుపై పార్టీ వర్గాలతో సమీక్ష
అమరావతి (చైతన్య రథం): అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలను సహించబోనని హెచ్చరించారు. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కేంద్రంగా వచ్చిన వివాదాలు, ఘటనలపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల తీరుపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇచ్చేలా ఎమ్మెల్యేల వైఖరి ఉండకూడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై వివాదాలు, తప్పుడు ప్రచారాలు తలెత్తినపుడు.. వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, నేతలు చేసే పనులు పార్టీకి చెడ్డపేరు తెస్తాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని నిలదీశారు. మూడు విషయాలపై పార్టీ నాయకత్వం నుంచి చంద్రబాబు నివేదిక కోరినట్టు సమాచారం. ఉచిత బస్సుపై వైకాపా చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజలతో మమేకం కావడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సూపర్ సిక్స్ పథకాలు, ప్రజా స్పందనపై పార్టీ వర్గాలతో సీఎం చంద్రబాబు లోతుగా సమీక్షించారు. అన్నదాత సుఖీభవ పథకంపై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలపై సమీక్షిస్తూ.. ఏమేరకు ఫలితాలు రాబట్టామన్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రారంభించిన ‘స్త్రీశక్తి’ పథకం పట్ల అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన స్పందన వస్తోందని చంద్రబాబుకు పార్టీ విభాగాలు వివరించాయి. సూపర్ సిక్స్ సూపర్ హిట్‌తో వైసీపీ అంతర్మథనంలో పడిరదని…. దీంతో తప్పుడు ప్రచారాలకు తెరలేపుతోందని ముఖ్యమంత్రికి పార్టీ వర్గాలు వివరించినట్టు తెలుస్తోంది. ఉచిత బస్సుపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ, అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. పథకాల అమల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా భాగస్వాములయ్యేలా చూడాలని పార్టీ యంత్రంగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకమవ్వడం ద్వారానే ప్రభుత్వ పథకాలకు సార్థకత చేకూరుతుందని, తద్వారా ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.