- యువతి తండ్రికి ఫోన్, ఆరోగ్యంపై ఆరా
- అత్యంత మెరుగైన వైద్యం అందిస్తామని హామీ
- దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక
అమరావతి (చైతన్యరథం): యాసిడ్ దాడి బాధితురాలికి అన్నలా అండగా ఉంటానని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై యాసిడ్ దాడి ఘటనను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. బాధితురాలి తండ్రి జనార్ధన్‌కు మంత్రి లోకేష్ ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేశారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌తో మాట్లాడిన లోకేష్… గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరో చెల్లిపై ఇటువంటి ఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.