- పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలి
- బాధ్యతతో పనిచేస్తేనే గుర్తింపు
- సీఎం చంద్రబాబు పాలనా దక్షత, మంత్రి లోకేష్ పోరాట పటిమ స్ఫూర్తితో పనిచేయాలి
- టీడీపీ మండలాధ్యక్షుల శిక్షణా తరగతుల్లో నేతల పిలుపు
- విజయవంతంగా మొదటి రోజు శిక్షణా తరగతులు
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బ్యాక్ బోన్ అని… పార్టీ కష్టకాలంలోనూ కేసులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేశారని మంత్రులు, పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మండలాధ్యక్షులు 110 మందికి శిక్షణ తరగతులు సోమవారం నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులు టీడీపీ మానవ వనరుల అభివృద్ధి విభాగం చైర్మన్, శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు ఆధ్వర్యంలో జరిగాయి. ఉదయం 6 గంటలకు యోగాతో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వేపాడ చిరంజీవిరావు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పల్లా శ్రీనివాసరావు శిక్షణా తరగతుల్లో ప్రారంభోపన్యాసం చేశారు. నాయకుడి నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ నిత్యం తమను తాము మెరుగుపరుచుకున్నప్పుడే పార్టీ ఒక వటవృక్షంలా ఎదుగుతుందని, దానికి ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయని తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనా దక్షత, మంత్రి నారా లోకేష్ పోరాట పటిమ నుండి కార్యకర్తలు స్ఫూర్తి పొందాలని పిలుపు ఇచ్చారు.
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న పాఠాలను తమ గ్రామం, మండలం, రోజువారీ క్షేత్రస్థాయి పనుల్లో ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యకర్తలు చురుగ్గా ఉంటూ, వ్యవస్థీకృతంగా పనిచేస్తూ, నిత్యం ప్రజలతో మమేకమైనప్పుడే పార్టీ అజేయ శక్తిగా మారుతుందని ఉద్ఘాటించారు. మండల పార్టీ అధ్యక్షులను నాలుగు గ్రూపులుగా విభజించి పార్టీ నిర్మాణం, పార్టీ సిద్ధాంతం, పార్టీ ప్రస్థానం వంటి విషయాలను వివరించారు. ఈ శిక్షణ తరగతుల్లో మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ సలహదారు, ఎంఏ. షరీఫ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతతో పనిచేస్తే గుర్తింపు: హోం మంత్రి అనిత
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షలో ఉన్నా పార్టీ మనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే మనకు గుర్తింపు అదే వస్తుందని హెూంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పార్టీ క్రమశిక్షణ, బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, కార్యకర్తలను ఉత్సాహపూర్వకంగా నడిపించడం వంటి అంశాలను శిక్షణ తరగతుల్లో వివరించారు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలమని…. కానీ కార్యకర్తలకు ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేని గౌరవ, మర్యాదలు తెలుగు దేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు.
ఎన్ని సమస్యలు వచ్చినా పార్టీ నిలబడింది: మంత్రి నిమ్మల రామానాయుడు
1983లో టీడీపీ దేశ రాజకీయాల్లోనే ఒక ప్రభంజనం సృష్టించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమం కోసం పాటుపడటం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయడం టీడీపీ చరిత్ర. గెలుపు, ఓటములతో పనిలేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం బలంగా నిలబడ్డే కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. సామాన్యులను కూడా నాయకులను చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
ప్రధానులకు ఎంపిక చేసిన పార్టీ టీడీపీ: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లోనే ఒక ప్రభంజనం సృష్టించారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. 1984లో లోక్సభలో ప్రతిపక్ష హెూదా పాత్రను టీడీపీ సమర్థవంతంగా పోషించింది. ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రతిపక్ష హెూదా పొందడం దేశ చరిత్రలోనే రికార్డ్. సీఎం చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఉండి హెచ్.డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ వంటి వారిని ప్రధాన మంత్రులుగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించారు. జాతీయ రాజకీయాల్లో కింగ్మేకర్గా నాడు, నేడు చంద్రబాబు అవతరించారు. అలాంటి పార్టీకి మండల స్థాయిలో మీరు పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు: దేవినేని
తెలుగుదేశం పార్టీకి ఉన్న చరిత్ర, సంస్థాగత నిర్మాణం మరే ఇతర పార్టీలకు లేదని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అలాగే దేశంలో మరే ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీల్లో కూడా పార్టీ క్యాడర్కు తెలుగుదేశం పార్టీ ఇచ్చినంత గౌరవం, మర్యాద ఇతర పార్టీలు ఇవ్వలేదు. తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబుల రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో 65 లక్షల ఉన్న పార్టీ సభ్యత్వం నేడు కోటి దాటిందంటే అది పార్టీ కోసం లోకేష్ చేస్తున్న కృషికి, ఆయన పట్టుదలకు నిదర్శనం. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూనే ప్రభుత్వ కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారని దేవినేని అన్నారు.
కష్టాల్లోనూ తోడుగా: కాలవ శ్రీనివాసులు
ప్రభుత్వంలో ఉంటే అధికారాన్ని అనుభవించడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, పార్టీ క్యాడర్ను కలవకుండా మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ లు ఫామ్ హౌసులకే పరిమితం అయ్యారని పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడారు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు. నాయకుడంటే కష్టాల్లోనూ తోడుగా నిలబడేవాడు. అలాంటి నాయకుడే మన చంద్రబాబు, అతి సాధారణ కార్యకర్తలు నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పోలిట్బ్యూరో మెంబర్లుగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయకత్వ గొప్పతనం. పార్టీ కోసం పనిచేసిన సామాన్యులకు అగ్రతాంబూలం ఇవ్వడం చంద్రబాబుకే సాధ్యం. రిపోర్టర్ స్థాయిలో ఉన్న తనను గుర్తించి సీఎం చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చారని కాలవ గుర్తుచేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సూపర్ సిక్స్ పథకాలైన పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి- ఉచిత బస్సు -ప్రయాణాలు, తదితర పథకాలను గ్రామ, మండల స్థాయిలో ప్రజలకు చేరవేయడం, కమిటీల నియామకాలు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ సలహదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు వివరించారు. కార్యకర్తల మధ్య ఐక్యత పెంచడానికి రూపొందించిన అంశాలను వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మండలాధ్యక్షుల పాత్ర కీలకమని… క్షేత్ర స్థాయిలో పర్యటించి, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.













