- విద్యాశాఖా మంత్రిగా వినూత్న పథకాలు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం
- అందుకే నా సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్లు పంపిణీ
- విజయవాడ, తిరువూరు డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేత
- కేబీఎన్ కాలేజీలో స్పోర్ట్స్ కిట్ల సరఫరా
- త్వరలో జగ్గయ్యపేట, నందిగామ స్కూళ్లకు
విజయవాడ, (చైతన్యరథం): విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ వెల్లడిరచారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు క్రీడల్లో రాణించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మే నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయనుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలకు తన సొంత నిధులతో 8 క్రీడలకు సంబంధించిన క్రీడావస్తువులతో క్రీడా వికాసం పేరుతో స్పోర్ట్స్ కిట్లు అందజేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం రోజున ప్రారంభించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలకు క్రీడావికాసం స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. బుధవారం కేబీఎన్ కళాశాలలో విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లోని 67 ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా వికాసం స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 5, సెంట్రల్ నియోజకవర్గంలో 10, తిరువూరులో 27, మైలవరంలో 25 ప్రభుత్వం పాఠశాలలకు ఎంపీ కేశినేని శివనాథ్ క్రీడా వికాసం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు తన సొంత నిధులతో అందించిన ఈ స్పోర్ట్స్ కిట్లలో వాలీబాల్ నెట్స్, వాలీబాల్స్, త్రో బాల్ నెట్స్, త్రో బాల్స్, టెన్నీకాయిట్ నెట్స్, టెన్నీకాయిట్స్, హ్యాండ్ బాల్స్, షటిల్ నెట్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డ్ అండ్ కాయిన్స్, ఖో-ఖో పోల్స్, బాల్ బ్యాడ్మింటన్ కిట్, హై జంప్ స్టాండ్స్, టేక్ ఆఫ్ బోర్డ్ వున్నాయి. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రౌండ్స్ అధ్వాన్నంగా తయారై విద్యార్ధులు ఆటలకు దూరమైపోయారన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు చదువుల్లోనే కాదు..ఆటల్లో కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు. అందుకే తన సొంత నిధులతో జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ అభివృద్ధి చేయించి లాంగ్ జంప్ పిట్స్ సిద్ద చేయించానన్నారు. అలాగే విద్యార్ధులకు అవసరమైన క్రీడా వస్తువులను కూడా జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం త్వరలో జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఉంటుందన్నారు. తనకిష్టమైన నాయకుల్లో మంత్రి నారా లోకేష్ ఒకరన్నారు. ఆయన విద్య శాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేసేందుకు మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్ ఒక పండుగలా నిర్వహించారని గుర్తు చేశారు. ఇక కాలేజీ విద్యార్ధులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలని అదే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించి అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, అందుకే మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రెండు క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ ఏపీ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకువెళుతున్నారని కొనియాడారు. వీరి స్పూర్తితో ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ తన సొంత నిధులతో పంపిణీ చేయటం చాలా సంతోషంగా వుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు జిల్లా స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్ధులు క్రీడల్లో నైపుణ్యం సంపాదించటానికి సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సమస్యలుంటే తన దృష్టి తీసుకురావాలన్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల మైదానాలు అభివృద్ధి చేయటంతో పాటు స్పోర్ట్స్ కిట్లు అందించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్ధులను చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు నెలల క్రితం కేబీఎన్ కాలేజీలో జరిగిన డిస్ట్రిక్ట్ పీడీ రివ్యూ మీటింగ్‌లో చెప్పిన విధంగా జిల్లా వ్యాప్తంగా వున్న ప్రభుత్వ పాఠశాలల మైదానాలు బాగు చేయించి, పాఠశాలలకు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయటం చాలా గొప్ప విషయమని, ప్రభుత్వ నిధులతో కాకుండా సొంత నిధులతో అభివృద్ది పనులు చేపట్టే నాయకులు అరుదుగా వుంటారని, ఆ వరుసలో ఎంపి కేశినేని శివనాథ్ ముందు వుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేపీవీవీ గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఏవో డాక్టర్ వి నారాయణ రావు, కేబీఎన్ సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్‌ఎస్ బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాప్‌ా పాల్గొన్నారు.