- గత పాలనలో నాతో సహా ప్రజలంతా బాధితులే
- గత ప్రభుత్వ ఆరాచకాలకు నేనే మొదటి బాధితుడిని
- ప్రజాస్వామ్యం కోసం పోరాడితే పదుల్లో కేసులు పెట్టారు
- ఇప్పుడిక.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు
- కూటమి వచ్చాకే మహిళలపై నేరాలు తగ్గుముఖం
- సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల కుట్రల్ని ఛేదిస్తాం
- శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
- శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చలో సీఎం సమాధానం
అమరావతి (చైతన్య రథం): గత పాలకుల అరాచకానికి ప్రజలతోపాటు తానూ బాధితుడినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పుడు కేసులతో వేధించడానికి అరెస్టు చేసి జైల్లో పెట్టారనీ… జైల్లో కూడా తన కదలికలు చూడ్డానికి డ్రోన్ ఎగరేశారనీ గుర్తు చేశారు. గురువారం శాసనసభలో శాంతిభద్రతల అంశంపై స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి -సామాజిక మాధ్యమాల అంశంపై ప్రసంగించారు. “గత ప్రభుత్వహయాంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరిపైనా కేసులు పెట్టారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అత్యాచారయత్నం కేసులు పెట్టారు. ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గత పాలకులు పెట్టిన కేసుల బాధితులే. నాపై 17 కేసులు పెట్టి వేధించారు. ఇది అరాచకానికి పరాకాష్ట. యువగళం పాదయాత్ర ద్వారా మంత్రి లోకేశ్ ప్రజలను కలిస్తే కేసులు పెట్టారు. అంగళ్లులో నాపై దాడి చేయించి, మళ్లీ నాపైనే కేసులు పెట్టారు. ప్రజలతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటే కరెంటు తొలగించి వేధించారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన రెడ్డి, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమ, బీటెక్ రవి, కూస రవి.. ఇలా నేతలపై కేసులుపెట్టి వేధించారు. రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసినప్పుడు ఆయనను ఏం చేస్తారోననే ఆందోళన వెంటాడింది. గత ప్రభుత్వ హయాంలో అందరిపైనా కేసులు, వేధింపులే. అమరావతి రైతులు, మహిళలు రాజధాని కోసం పోరాడుతుంటే బాత్రూమ్లపై డ్రోన్లు ఎగరేశారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకూ అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. గత పాలకుల అరాచకాలు భరించలేక పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రంనుంచి పారిపోయారు. అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన పరిశ్రమను పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లిపోయారు. రాజకీయాల నుంచే తప్పుకున్నారు. చివరకు సింగపూర్ ప్రభుత్వంపైనా అభాంగాలు వేసి ప్రాజెక్టునుంచి వైదొలిగేలా చేశారు.2019-24 వరకూ రాష్ట్రం తీవ్రస్థాయిలో అరాచకాలను భరించింది. గత పాలకులు టీడీపీ కార్యాలయంపైనా దాడికి తెగబడ్డారు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు భయానకమైన చరిత్రను గుర్తు చేశారు.
మేం కక్షసాధింపు రాజకీయాలు చేయం
“బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టే ప్రజలు నన్ను నాలుగోసారి ఎన్నుకున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే అరెస్టు చేసి ఉండేవాళ్లం. గతంలో సీఎంగా ఉండగా అలిపిరి వద్ద నక్సల్స్ 23 క్లైమోర్ మైన్లు బ్లాస్ట్ చేశారు. అలాంటి పరిస్థితులనుంచి బయటపడి నిన్న మళ్లీ తిరుమల శ్రీవారికి సీఎంగా 14వసారి పట్టువస్త్రాలు సమర్పించాను. రాజకీయ, ఆర్దిక, సామాజిక, సమస్యల గురించి నక్సల్స్కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే.. నాపై క్లైమోర్మెన్స్ పేల్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నా ప్రాణాలు త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డాను. రాయలసీమలోనూ కరడుగట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలను రూపు మాపాం. టీడీపీ తీసుకున్న విధానాలవల్లే రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మతవిద్వేషాలనూ సమర్ధవంతంగా కట్టడి చేశాం. గత పాలకుల హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల ఆవేశానికీ అర్ధం ఉంది. అయితే వారు ప్రవర్తించిన విధంగానే మనమూ ప్రవర్తించకూడదు. తప్పుచేసిన ఎవరికైనా శిక్ష తథ్యం. చట్టప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు. స్వర్ణాంధ్ర-2047 విజన్కు అనుగుణంగా ఏపీ ముందుకెళ్లాలి. అగ్రస్థాయి రాష్ట్రంగా ఏపీ ఉండాలి” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కట్టడికి చర్యలు
“సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు సాగిస్తూ.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తప్పవు. గత పాలకుల హయాంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారు. కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ ఒక్కొ వ్యవస్థనూ సరిదిద్దుకుంటూ వస్తున్నాం. నేరస్థులకు అండగా ఉండే రాజకీయాలను నేను ఇంతవరకూ చూడలేదు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయటపెట్టాలి. వారి ముసుగు తీస్తే ప్రజలే అర్ధం చేసుకుంటారు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయే వరకూ జాగ్రత్తగా ఉండే నాపై కూడా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేటియం బ్యాచ్లను పెట్టి పెద్దఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం పోయాక మరోలా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తీవ్రస్థాయిలో వేధింపులు చేస్తున్నారు. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం. ఫేక్ ప్రచారాలు చేసే నేరస్తులు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకువస్తాం. మహిళలపై కించపరిచేలా పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ తరహా నేరాలపై సీరియస్ గా వ్యవహరిస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
క్రిమినల్స్తో కలిసిపోయి ముఖ్యమంత్రికే నోటీసులా?
“వివేకా హత్య తర్వాత క్రైమ్ సీన్లో సీఐ శంకరయ్య ఉన్నారు. సీఎంకు నోటీసులు పంపించటమంటే ఎంత ధైర్యం చేసి ఉండాలి. నేరం జరిగినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్సులో సీఐగా విధులు నిర్వహించి నేరం జరిగిన ప్రాంతాన్ని రక్షించాలి. కానీ క్రిమినల్స్తో కలిసిపోయి ముఖ్యమంత్రికే నోటీసు పంపించేస్థాయికి సీఐ శంకరయ్య చేరుకున్నారు. వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రిగా నన్నూ ఏమార్చారు. అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేశారు. ఏమీ తెలియని వారిలా అమాయకంగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు.చివరకు గుండెపోటు కాదు గొడ్డలి పోటు అని తేలింది. ఫేక్ రాజకీయాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయంగా చాలామందిని ఎదుర్కొన్న నేను ఇప్పుడు నేరస్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీ రాజకీయాలు చెల్లవు
“పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్లి సినిమా డైలాగులు మాట్లాడారు. మహిళలను కించపరిచేలా పోస్టింగులు పెట్టి అవమానించారు. సింగయ్యను కారు కింద తొక్కించేసి తిరిగి బురదజల్లే ప్రయత్నం చేశారు. కనీసం మానవత్వం లేకుండా పొదల్లోకి విసిరేసి వెళ్లిపోయారు. తిరిగి మృతుడి భార్యతో అసత్యాలు చెప్పించారు. తన భర్త జగన్ కారు కిందపడి చనిపోలేదు, పోలీసులు అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని ప్రకటన చేయించారు. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లి రోడ్డుపై మామిడికాయలను ట్రాక్టర్లతో తొక్కించారు. రౌడీ రాజకీయాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కూటమి ప్రభుత్వంలో రౌడీ రాజకీయాలు చేయాలంటే కదరదు’ అని సీఎం స్పష్టం చేశారు.
మహిళలపై నేరాలను కట్టడి చేశాం
“మహిళలపై రాష్ట్రంలో నేరాలు తగ్గాయి. గతంతో పోల్చుకుంటే 4.84 శాతంమేర మహిళలపై నేరాలు తగ్గాయి. వరకట్న మరణాలు 43శాతం తగ్గాయి. మహిళా హత్యలు 15శాతం తగ్గాయి. మహిళా ఆత్మహత్యలు 59 శాతం తగ్గాయి. మహిళలపై సైబర్ వేధింపులు 17 శాతం తగ్గాయి. వరకట్న వేధింపులు 25శాతం తగ్గాయి. మహిళలపై నేరాలకు పాల్పడ్డ వారిలో 343 మందికి శిక్షలు పడ్డాయి. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజవుతుందని హెచ్చిరిస్తున్నాం. మహిళలపై నేరం జరిగితే కేవలం 8-10 నిముషాల్లోపే ఘటనా స్థలికి చేరుకునేలా చర్యలుచేపట్టాం. శక్తి టీమ్ ను ఏర్పాటుచేసి మహిళల రక్షణపట్ల చర్యలు చేపడుతున్నాం. సెక్సువల్ అఫెండర్లపైనా రౌడీషీట్లను ఓపెన్ చేస్తాం. ఆన్ లైన్లోనూ నేరస్తుల ఫోటోలు పెడతాం. రాష్ట్రంలో ఓ ఉద్యమంగా డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్సు ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నాం. రాష్ట్రంలో గంజాయిని జీరో కల్టివేషన్ స్థాయికి తీసుకువచ్చాం. అయితే పొరుగు రాష్ట్రాలనుంచి కొంతమేర అక్రమంగా రవాణా అవుతోంది. రాష్ట్రంలో సైబర్ ఫ్రాడ్స్ కోట్లలో నష్టపోతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు కూడా సైబర్ ఫ్రాడ్స్ ఉచ్చులో పడి డబ్బు నష్టపోతున్నారు. సైబర్ క్రైమ్స్, ఫ్రాడ్స్ ఉచ్చులో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టాం. ఫోరెన్సిక్స్ను కూడా బలోపేతం చేస్తున్నాం. శాంతిభద్రతల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
అసెంబ్లీకి డుమ్మా ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమరావతి (చైతన్య రథం); ఆలస్యంగా వచ్చి, అసెంబ్లీ సమావేశాలు పూర్తికాక ముందే వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసనసభలో 30మంది ఎమ్మెల్యేలున్నారు. వెంటనే అసెంబ్లీలో విప్లను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అప్రమత్తం చేశారు. సీఎం ఆరా తీయడంతో సమావేశానికి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలకు విప్లు ఫోన్లు చేశారు. అప్పటికప్పుడు 17మంది ఎమ్మెల్యేలను పిలిపించారు. పూర్తిస్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.