- ప్రణాళికా బద్ధంగా మౌలిక వసతులు, అభివృద్ధి
- మెడికల్ కాలేజీ ఏర్పాటు
- మంత్రి మండిపల్లికి సీఎం చంద్రబాబు భరోసా
- మంత్రులు అనగాని, అచ్చెన్నాయుడు సమక్షంలో సీఎంతో మంత్రి మండిపల్లి భేటీ
- ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడిన ముఖ్యమంత్రి
- రాయచోటిపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక మమకారం: మంత్రి మండిపల్లి
అమరావతి (చైతన్యరథం): రాయచోటి అభివృద్ధి బాధ్యతలను తాను తీసుకుంటానని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడంతో మనస్తాపానికి లోనైన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మంత్రి మండిపల్లిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. సీఎంఓ నుండి ఫోన్‌కాల్ రావడంతో మంత్రి మండిపల్లి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. రాయచోటిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయచోటిపై తనకున్న అనుబంధం, మమకారం గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
జిల్లా కేంద్రంగా లేనప్పటికీ గతంలో రూపొందించిన ప్రణాళికల ప్రకారమే రాయచోటిని ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. అవసరమైన అన్ని మౌలిక వసతులు, పరిపాలనా సదుపాయాలతో రాయచోటి మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయచోటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.















