చంద్రబాబు, లోకేష్ పర్యటనలలో జనప్రభంజనం
టిడిపి పట్ల పెరుగుతున్న సానుకూల దృక్పథం
ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న చంద్రబాబు
యువతలో పోరాట స్ఫూర్తి రగులుస్తున్న లోకేష్
రాష్ట్ర మనుగడ, భావితరాల భవిష్యత్ టిడిపి తోనే అన్న భావన
……
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి జోష్ లో వుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనలలో జనకెరటం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపున్న యువగళం పాదయాత్ర జనసునామీని తలపిస్తోంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల అన్ని వర్గాల ప్రజలలో సానుకూల దృక్పథం గోచరిస్తున్నది.
గత నాలుగేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ప్రజానీకం తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారపీఠం అధిష్టించే శుభగడియల కోసం తెలుగుప్రజానీకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఆవిర్భావ సమయం నుంచి టిడిపిని వ్యతిరేకించిన వర్గాలు, నాయకులు సైతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర మనుగడ, భావి తరాల భవిష్యత్ ఆధారపడి వుందన్న నిర్ణయానికి వచ్చేసిన వాతావరణం కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఎంతోమంది నాయకులు వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.
క్షేత్రస్థాయిలో టిడిపి పట్ల పెరుగుతున్న సానుకూలత కు ఇది ఒక సంకేతంగా భావించవచ్చు. గతంలో ఏ ప్రభుత్వానికీ ఎదురుకానంత ప్రజావ్యతిరేకతను ప్రస్తుత అధికార పార్టీ చవిచూస్తోంది. ఒకవైపు అన్నివర్గాల ప్రజలలో చంద్రబాబు, లోకేష్ ల పై పెరుగుతున్న భరోసా, పార్టీ పట్ల అధికమవుతున్న సానుకూలత, మరోవైపు తారాస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లు ఏకకాలంలో చోటుచేసుకోవడంతో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయం లాంఛనమే అన్న వాతావరణం నెలకొని వుంది.
అయితే రాజకీయాలలో అపర చాణక్యునిగా పేరొందిన చంద్రబాబు ప్రత్యర్థులకు ఊపిరి సలపనీయని రీతిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు చంద్రబాబు చాణక్యం, మరోవైపు లోకేష్ పోరాట పటిమ టిడిపి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ చంద్రబాబు జరుపుతున్న పర్యటనల్లో ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నిత్యజీవనంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం మోసగిస్తున్న వైనం గురించి చంద్రబాబు వివరిస్తున్న తీరు సామాన్య ప్రజానీకాన్ని ఉత్తేజితులను చేస్తోంది.
ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇస్తూ ప్రజలపై పన్నుల బాదుడు విధిస్తున్నది. ఆదాయం తగ్గటం, నిరుద్యోగ పెరగటం, నెలవారీ ఖర్చులు పెరుగుతుండటం తో మధ్యతరగతి ప్రజలు పేద లుగా మారిపోతున్నారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రయివేటు, పార్టనర్ షిప్ (పి) ఫార్ములా తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనా చేసేందుకు చంద్రబాబు కృతనిశ్చయంతో వున్నారు.
అదేసమయంలో నారా లోకేష్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో గత నూరు రోజుల పైనుంచి యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే లోకేష్ జరుపుతున్న పాదయాత్ర వినూత్నమైనదిగా గుర్తింపు పొందింది. లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలతో మమేకం అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, ఎక్కడికక్కడే స్పష్టమైన హామీ లు ఇస్తూ ముందుకు సాగుతున్న యువగళం పాదయాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఆ పాదయాత్రను నిలువరించేందుకు అధికార పార్టీ ఆదిలో విశ్వప్రయత్నం చేసింది.
రోజురోజుకూ సునామీని తలపిస్తూ ముందుకు సాగుతున్న యువగళం పాదయాత్ర ముందు అధికార పార్టీ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి.. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ముందు నిలబడి సెల్ఫీ ఛాలెంజ్ లు విసరటం కలకలం రేకెత్తిస్తోంది. దీనికితోడు ప్రతిరోజూ తనని చూడటానికి వస్తున్న ప్రజానీకం తో సెల్ఫీ లు దిగుతుండటం తో అన్ని వర్గాల ప్రజలతో లోకేష్ ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు.
కేవలం వందరోజుల లోనే దాదాపు లక్షన్నర మంది సెల్ఫీలు దిగారంటే లోకేష్ పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. అదేవిధంగా లోకేష్ వెళ్లిన ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఆయా నాయకుల అవినీతిని ఆధారాలతో సహా బహిర్గతం చేస్తూ బహిరంగ చర్చకు సవాళ్లు విసురుతుండటం టిడిపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తోంది.