- రూ.1,217 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టులు
- విశాఖ ప్రాంతీయ సదస్సులో కుదిరిన ఎంవోయూలు
- తద్వారా 2,567 ఉద్యోగాల కల్పన
- మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- అరకు చలి ఫెస్టివల్ బ్రోచర్ విడుదల
విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖపట్టణంలో జరిగిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు వేదికగా రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలు కుదిరాయి. సోమవారం విశాఖపట్టణం బీచ్‌రోడ్ లోని నోవాటెల్ హోటల్లో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు 150 మందికి పైగా ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆతిథ్య రంగంలో 825 రూమ్‌లు ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఐదేళ్లలో రాష్ట్రంలో 50,000 రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు విజయవంతం కావడంపై మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎంవోయూ చేసుకున్న 8 పర్యాటక ప్రాజెక్టులు కీలకమైనవిగా తెలిపారు. ప్రధానంగా అట్మోస్పియర్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. 500 రూమ్‌లను విశాఖపట్టణం, తిరుపతి, అమరావతిలో కట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. వైజాగ్‌లో 75 రూమ్‌లు కట్టేందుకు సునీయశశ్రీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధంగా ఉందన్నారు. వైజాగ్ పోర్టులో లగ్జరీ క్రూయిజ్ ప్రారంభించేందుకు డాల్ఫిన్ ఓషియన్ క్రూయిజ్ సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మైస్ సెంటర్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రిప్పిల్స్ అండ్ కంపెనీ ముందుకొచ్చాయన్నారు. ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్, బ్లూబే ఇన్ ఫ్రా ప్రాజెక్టు ప్రతినిధులు 100 రూమ్‌లతో వైజాగ్‌లో లగ్జరీ రిసార్ట్‌లను కట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. రాయల్ ఫామ్స్ బీచ్ రిసార్ట్స్, హోటల్ ఎస్ పార్క్.. బాపట్ల జిల్లాలో 100 రూమ్‌లను నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు.
రాయితీలకు సిద్ధం
గతంలో టీడీపీ హయాంలో మాదిరిగా రాత్రి వేళల్లో మరికొంత సమయం వరకు హోటళ్లను నడిపేందుకు అవకాశం కల్పించాలని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారని మంత్రి తెలిపారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త పర్యాటక పాలసీ ద్వారా జీఎస్టీ, పవర్ ఛార్జీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జీల విషయంలో పరిశ్రమ రంగానికిచ్చే రాయితీలు పర్యాటక రంగానికి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అడ్డంకులను అధిగమించి పెట్టుబడిదారులకు సహకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పష్టమైన ప్రతిపాదనలతో ప్రాజెక్టులను తీసుకురావాలని, ఆచరణ సాధ్యం అనుకుంటే తక్షణమే అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వేగవంతంగా పనిచేసే అధికారులు పర్యాటక శాఖలో ఉన్నారని, సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామని, ఆచరణ సాధ్యం కాకుంటే వెంటనే చెప్పేస్తామన్నారు. స్టార్ హోటళ్లలో రూ.66 లక్షలుగా ఉన్న లిక్కర్ బార్ లైసెన్స్ భారంగా ఉందని, దాన్ని రూ.20 లక్షలకు తగ్గించాలని కోరామన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని మంత్రి దుర్గేష్ వెల్లడిరచారు.
పర్యాటక రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలన్న దశాబ్దాల కోరికను పర్యాటకంపై మక్కువ ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, పర్యాటకంతో పాటు పర్యావరణం బాగుండాలని కోరుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారని అది పర్యాటకాభివృద్ధికి నాందిగా, మార్పుకు తొలిమెట్టుగా భావించాలన్నారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకరంగానికి ఇస్తున్నామన్నారు. ఇటీవలే నూతన పర్యాటక పాలసీ 2025-29 తీసుకువచ్చామని గుర్తుచేశారు.
గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక రంగానికి ఆదాయం వచ్చే హోటళ్లను కూలగొట్టి సొంత అవసరాల కోసం రాజప్రాసాదాల్లాంటి విలాసవంతమైన భవంతులు నిర్మించడం దారుణం అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం సలహా మేరకు ప్రజల భాగస్వామ్యంతో పర్యాటకాభివృద్ధికి చేపడుతున్నామన్నారు.
విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్
విశాలమైన సముద్రతీరం ఉన్న ఏపీలో క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నామన్నారు. గతంలో ఈ తరహా ఒక కార్యక్రమం చేపడితే పాండిచ్చేరి ప్రభుత్వంతో వచ్చిన సమస్య వల్ల ఆగిందని గుర్తుచేశారు. ఈ విషయమై ఇటీవల సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ సదస్సులో.. పాండిచ్చేరి ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో మాట్లాడగా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారన్నారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు కానుందన్నారు. ఎంటర్టైన్మెంట్, టూరిజంకు రియల్ హబ్‌గా విశాఖపట్టణం నిలుస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. స్థానికంగా అడ్వెంచర్, ఎకో, వెల్నెస్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమానికి ముందు ఇటీవల పర్యాటక సెక్రటరీగా నియమితులైన అజయ్ జైన్.. మంత్రి కందుల దుర్గేష్‌ను నోవాటెల్ హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 2 వరకు జరిగే అరకు చలి ఫెస్టివల్‌కు సంబంధించిన బ్రోచర్ ను మంత్రి దుర్గేష్ విడుదల చేశారు.
కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జిల్లా మాడుగుల, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, లోకం నాగమాధవి, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట, విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్రప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.