- సింహభాగం సంగం బ్యారేజి పనులు చేసిందెవరు?
- చంద్రబాబు హయాంలోనే 80శాతం పనులు
- మూడేళ్లలో చేసింది 10 శాతం పనులు మాత్రమే
- ఇంకా 10శాతం మిగిలి ఉండగానే ఓపెనింగ్
- అంతా తానే చేసినట్లుగా జగన్ రెడ్డి కలరింగ్
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
కూల్చడమే తప్ప నిర్మాణం తెలియని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నేతృత్వంలోని విధ్వంసక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40నెలలు పూర్తికావస్తోంది. అభివృద్ధి విషయంలో మూడేళ్లలో అంగుళం కూడా ముందుకు కదలించలేని చేతగాని జగన్ సర్కార్.. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు రిబ్బన్ కటింగ్‌లు చేసుకుంటూ తామే చేసినట్లుగా కలరింగ్ ఇచ్చుకుంటోంది. చంద్రబాబు నాయుడు హయాంలో 80శాతం పూర్తిచేసిన నెల్లూరు సమీపంలోని సంగం బ్యారేజిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులకు స్టిక్కర్లు వేసుకుంటూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్న జగన్ రెడ్డి మూడేళ్లలో ఆపసోపాలు పడుతూ కేవలం 10శాతం పనులు పూర్తిచేసి అంతా తానే చేసినట్లుగా డప్పాలు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి సంగం బ్యారేజీ పనులను శరవేగంగా పరుగులు తీయించి నెల్లూరు ప్రజల దశాబ్దాల కల సాకారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది.
తెదేపా హయాంలో దాదాపు 80శాతం పనులు పూర్తి చేయగా, 40నెలల జగన్ రెడ్డి పాలనలో కేవలం 10శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు. బ్యారేజీ పరీ వాహక ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించక పోవడంతో జయలలితా నగర్, ఇస్లాంపేట, బుజ్జమ్మ డొంక, పొర్లు కట్ట, మన్సూర్ నగర్, పుత్తా ఎస్టేట్, శివగిరి కాలనీలు మునిగిపోయే ప్రమాదముందని తెలిసినా పట్టించు కోవ డం లేదు. ప్రాజెక్టు పనులు 2008లో ప్రారంభమైనా 2014 నాటికి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 2015లో చంద్రబాబునాయుడు గారు ప్రాజెక్టులో మార్పులు చేసి పనులు ముమ్మరం చేశారు.
సంగం బ్యారేజీ సంపూర్ణంగా పూర్తయితే పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువ కింద సాగులో ఉన్న దాదాపు 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. బ్యారేజీపై రవాణాకు వంతెన నిర్మించడంతో సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు వీలలైవుతోంది. అంతే కాకుండా బ్యారేజీ నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలమట్టం పెరిగి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సంగం బ్యారేజీకి పనులు పూర్తి చేసింది టీడీపీ అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా పేర్లు మార్చుకొని రిబన్ కటింగ్ చేసుకుంటున్నారు.
దాచేస్తే నిజాలు దాగవు జగన్ రెడ్డి?
వాస్తవానికి జగన్ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసేనాటికే ఈ బ్యారేజీ పనులు 82.86 శాతం పూర్తయ్యాయి. నెల్లూరు బ్యారేజికి రూ.91 కోట్లు, సంగం బ్యారేజికి రూ.64 కోట్లు వెచ్చిస్తే ఆ రెండు ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తి చేయవచ్చని 2019 నవంబరులోనే ప్రణాళిక రూపొందించారు. 2020 నవంబరు 11న జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నెల్లూరు, సంగం బ్యారేజీలను 2021 జనవరిలో ప్రారంభించాలని నిర్ణయించారు. రేపో, మాపో అంటూ చివరికి పనులు పూర్తి కాకపోయినా హడావుడిగా సెప్టెంబర్ 06, 2022న ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు.
జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యంచేసిన జగన్ రెడ్డి
చంద్రబాబు నాయుడు 5 ఏళ్లల్లో 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు పరుగులు తీయించి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందిస్తే మీరు మాత్రం జల వనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి చోధ్యం చూస్తున్నారు. జగన్ రెడ్డి 3 ఏళ్లల్లో జల వనరుల ప్రాజెక్టులకు రూ. 17,534.31 ఖర్చు చేశారు. అంటే ఏడాదికి ఖర్చు చేసింది 5,844.77 కోట్లు మాత్రమే. కాని చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి రూ.13,600 కోట్లు ఖర్చు చేశారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను కేంద్రం గజిట్ జారీ చేసి మరి చేతుల్లో తీసుకున్నా కనీసం నోరెత్తని చేతగాని, చేవచచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. హైదరాబాద్ లోని ఆస్తులను కాపాడుకోవటానికి, స్వప్రయోజనాల కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఏపీ నీటి హక్కులను బలిపెట్టారు. జగన్ చేతగానితనంతో ప్రాజెక్టులకు మరమ్మత్తులకు ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు 3వ గేటు, అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేటు కొట్టుకుపోయాయి. కమీషన్ల కక్కుర్తిని పక్కన పెట్టి చిత్తశుద్ధితో సంగం బ్యారేజి పనులు సంపూర్ణంగా పూర్తిచేసి చేసి రైతన్నలకు సాగు నీరందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.