- విజన్ `2020ని ఎగతాళి చేసినోళ్లే నేడు ఫలితాలు అనుభవిస్తున్నారు
- ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయని దుర్మార్గుడు జగన్ రెడ్డి
- సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కి లేదు
- మంత్రి కొల్లు రవీంద్ర మండిపాటు
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబు గురించి, ఆయన విజన్ గురించి మాట్లాడే కనీస అర్హత లేని వ్యక్తి జగన్ రెడ్డి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబు విజన్ ఏంటో సైబరాబాద్ నగరాన్ని చూసి జగన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. రాళ్లు రప్పల మధ్య నగరం ఏమిటని నాడు మాట్లాడిన వారే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా చేసిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. శంషాబాద్ విమానాశ్రయం, హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లు చంద్రబాబు విజన్‌లో భాగమే. మానవ వనరుల అభివృద్ధి గురించి మాట్లాడే జగన్ రెడ్డి.. గత ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో సమాధానం చెప్పగలరా? ఎన్ని డీఎస్సీలు భర్తీ చేశారు? ఎక్కడైనా రూపాయి ఆస్తి కల్పించారా? ఐదేళ్ల పాలనంతా దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమైనా ఉందా? ఐదేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తవలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నదుల అనుసంధానాన్ని ఎందుకు నీరుగార్చారో మాట్లాడాలి. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని నీచ చరిత్ర జగన్ రెడ్డిది. చంద్రబాబు విజన్‌లో భాగంగా రూపొందించిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్‌ను.. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మార్చేసి జేబులు నింపుకున్న ఘనత జగన్ రెడ్డిదే. 12 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులతో లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రత్యేక పాఠ్యాంశంలో చోటు దక్కించుకున్న జగన్ రెడ్డికి చంద్రబాబు విజన్ అర్ధం కావడం కష్టమేనని మంత్రి రవీంద్ర ఎద్దేవా చేశారు.
ఐదేళ్ల పాలనలో జగన్ ఉద్ధరించిందేమిటి?
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఆదాయం పెరగాలి. సొంత కాళ్లపై నిలబడాలన్న లక్ష్యంతో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇంటికో ఐటీ ఉద్యోగి నినాదంతో విజన్ 2020 ని చంద్రబాబు రూపొందించారు. అందుకు హైదరాబాద్‌లో బహుముఖాలుగా విస్తరించిన ఐటీ పరిశ్రమ తార్కాణం. ఇప్పుడు విభజిత ఆంధ్రాలో విజన్ 2047తో ఇంటికో పారిశ్రామిక వేతను తయారు చేయాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం. అదే జరిగితే తన మాటలు ప్రజలు వినరు, నమ్మరనే భయంతోనే జగన్ రెడ్డి దిక్కుమాలిన కుట్రలకు తెరలేపుతున్నాడు. ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డిని అడుగుతున్నా.. నీ ఐదేళ్ల పాలనలో ఏం ఉద్ధరించావ్? రూ.10 లక్షల కోట్ల అప్పులు చేయడం, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, ప్రభుత్వ ఆస్తుల్ని బెదిరించి అనుయాయులకు దోచిపెట్టడం తప్ప ఏం ఉద్ధరించావు? కాకినాడ పోర్టు అరబిందోకి కట్టబెట్టిందెవరు? అమరావతి రాజధానిని ఐదేళ్ల పాటు పడకేయించింది ఎవరు? పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45 మీటర్ల నుండి 41 మీటర్లకు కుదించి.. బ్యారేజీగా మార్చేందుకు కుట్రలు చేసిన ఘనత జగన్ రెడ్డిది కాదా? నీ దుర్మార్గాలను చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా బుద్ది మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని గుర్తుంచుకో. నీ స్కాములన్నీ బయట పడేసరికి చంద్రబాబుపై తప్పుడు ప్రచారానికి దిగటం సిగ్గుచేటు. నీవు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నిన్ను నమ్మరు. రాష్ట్రానికి నీవు చేసిన ద్రోహాన్ని గుర్తించిన ఏ ఒక్కరూ క్షమించబోరని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి కొల్లు స్పష్టం చేశారు.