- వివాదాస్పద ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్
- దస్త్రాల క్లియరెన్స్‌లో వేగం పెరగాలి..
- మంత్రులతో భేటీలో చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడితప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దస్త్రాల క్లియరెన్స్‌కు మంత్రులు వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. దస్త్రాల క్లియరెన్స్‌లో ఒక్కోటి సగటున 3 రోజులు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాను ఇప్పటి వరకు 3,366 దస్త్రాలను క్లియర్ చేశానని పేర్కొన్నారు. పౌరసరఫరాల మంత్రికి సగటున ఒక్కో దస్త్రానికి 33 రోజులు పట్టిందని అనగా.. లెక్కసరిగా లేదని మంత్రి మనోహర్ చెప్పారు. ఒకసారి పరిశీలిద్దామని సీఎం వ్యాఖ్యానించారు.
అంతకుముందు..
మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై మంత్రులతో ఐటీ మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్, నజీర్ అహ్మద్ అంశాలు ప్రస్తావించినట్టు సమాచారం. శ్రీకాంత్‌కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలనూ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతపురం శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదని లోకేశ్ పేర్కొన్నారు. సీఎం కూడా ఆగ్రహంతో ఉన్నారని మంత్రులతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నష్టం వచ్చేలావుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని అనితకు సూచించారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను లోకేశ్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామని లోకేశ్ తెలిపారు.