- రెండేళ్లలో 9 లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం
- గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
- డిశంబరుకు మరో లక్ష టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తాం
- పురపాలక మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ 2029నాటికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. బుధవారం సచివాలయం ప్రచార విభాగంలో మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణతో కలసి మీడియాతో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు, వాటి పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై సీఎం సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2.81 లక్షల ఇళ్లను పూర్తి చేశామని, వచ్చే నెల 15నాటికి 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. వీటితోపాటు పీఎంఏవై-2లో భాగంగా అర్బన్‌కు మంజూరైన 40 వేల ఇళ్లకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మరో 2 లక్షల ఇళ్లు (గృహా నిర్మాణ శాఖకు చెందిన లక్ష ఇళ్లు, లక్ష టిడ్కో ఇళ్లు) సంక్రాతినాటికి అందజేయాలని నిర్ణయించామన్నారు. ఇవికాక పీఎంఏవై-1.0లోని మరో 5 లక్షల ఇళ్లను రెండో ఏడాది పూర్తయ్యేలోపు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఈవిధంగా రెండేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందచేస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
పీఎంఏవై-2.0 నిబంధనలను కేంద్రం సవరించడంవల్ల ఇకపై కేవలం అర్బన్ (యు.ఎల్.బి.) ప్రాంతాల్లోనే ఈ పథకం క్రింద గృహాలను మంజూరు చేస్తారన్నారు. అర్బన్ డవలెప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రూరల్ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు ఇంకా ఎన్ని ఇళ్లను నిర్మించాలనే అంశంపై గృహా నిర్మాణ శాఖ సర్వే చేయగా.. దాదాపు 6.00 లక్షల ఇళ్లు అవసరమనే విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు. అయితే ఆర్టీజీఎస్ అంచనాలను కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా ఎన్ని గృహాలు నిర్మించాలనే విషయాన్ని అంచనావేసి రూరల్ హౌసింగ్ పథకం కింద ఇళ్లను నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలమిచ్చే అంశంపై రెవిన్యూ శాఖ అధికారులతో కలసి సర్వే చేయనున్నామన్నారు.
ఎన్టీఆర్ హౌసింగ్ పథకం క్రింద గత ప్రభుత్వం ఎటువంటి బకాయిలు చెల్లించలేదని, వాటిని ఇప్పుడు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గత ప్రభుత్వం అవకతవక ఆర్థిక విధానాలతో దాదాపు రూ.3,000 కోట్ల కేంద్ర నిధులను డైవర్టు చేశారని, అందులో దాదాపు రూ.900 కోట్లను ఇప్పటికే తమ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు విడుదల చేసిందన్నారు. హౌసింగ్ లే అవుట్లలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద మౌలిక వసతుల కల్పనకున్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారన్నారు. పి.ఎం.ఏ.వై. రూరల్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నదని, తద్వారా కేంద్రం నుండి రూ.350 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో రాక్రీట్ సంస్థపై విజిలెన్సు నివేదిక ప్రభుత్వానికి అందచేశారని, నివేదిక ఆధారంగా సంస్థపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆ సంస్థలు మధ్యలో వదిలేసిపోయిన దాదాపు 80 వేల ఇళ్లను కేంద్ర, రాష్ట్ర నిధులు దాదాపు రూ.800 కోట్లతో పూర్తి చేస్తామన్నారు.
డిశంబరుకు లక్ష టిడ్కో ఇళ్లు పూర్తి: నారాయణ
మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ డిశంబరుకు మరో లక్ష టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ఇప్పటికే టిడ్కో ప్రాజెక్టు కింద దాదాపు 83,072 ఇళ్లను పూర్తి చేశామని, అయితే వీటిలో 2014-19 మధ్యకాలంలోనే దాదాపు 75 వేల ఇళ్లను పూర్తి చేశామన్నారు. మిగిలినవి వచ్చే ఏడాది మార్చి 31కి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను 2.61 లక్షలకు కుదించిందని, వాటిని ముందుగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. టిడ్కో ప్రాజెక్టు పూర్తి చేయడానికి దాదాపు రూ.6,500 కోట్ల మేర నిధులు కావాల్సి ఉందన్నారు.
2014-19 మధ్యకాలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టామన్నారు. మూడు కేటగిరిల్లో దాదాపు 7 లక్షల ఇళ్లు నిర్మించేందుకు మంజూరు చేశామన్నారు. వాటిలో 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకోవడం జరిగిందని, వాటిలో 4.54 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచామన్నారు. 3.13 లక్షల ఇళ్లు గ్రౌండ్ చేశారని, అయితే గత ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై గృహా రుణాలు తీసుకుని ఇఎంఐలు కట్టకపోవడం వల్ల లబ్దిదారులకు నోటీసులు వస్తున్నాయన్నారు. ఇందుకై తమ ప్రభుత్వం రూ.140 కోట్లు ఈఎంఐ రూపేణా కట్టిందన్నారు. గత ప్రభుత్వం దాదాపు రూ.4,282 కోట్లు బకాయిలను కాంట్రాక్టర్లకు చెల్లించలేదని మంత్రి నారాయణ వివరించారు.