- అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి
- సీఎం చంద్రబాబు సంతాపం
హైదరాబాద్ (చైతన్యరథం): హైదరాబాద్ నగరంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్మినార్ వద్ద గుల్జార్ హౌస్‌లో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాననన్నారు.
హైదరాబాద్‌లో చార్మినార్‌కు అత్యంత సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద ఉన్న ఓ జీ-2 భవనంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మంటలతో పాటు దట్టమైన పొగలు వ్యాపించటంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో
చికిత్స పొందుతూ మృతిచెందారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరం అన్నారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాలకృష్ణ సంతాపం
గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం పట్ల హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాధాకరం: మంత్రి అనిత
హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోం,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత స్పందించారు. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారన్న వార్త తనను కలచివేసిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.