` అక్కడ తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు
` విలువల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు
` నిబంధనలపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు
అమరావతి (చైతన్యరథం): జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలోని ప్రజలకు తొలిసారిగా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం అమరావతిలో మంత్రి వంగలపూడి అనిత విలేకర్లతో మాట్లాడతూ.. పులివెందుల తమ అడ్డా అని జబ్బలు చరుచుకున్నవాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఓటమి భయం పట్టుకున్నందుకే జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు విలువలంటే తెలియదని.. అలాంటి ఆయన విలువల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుండటం చూసి స్థానికులు శ్చర్యపోతున్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకునే స్థాయి నుంచి 11 మంది అభ్యర్థులు స్థానిక జెడ్పీటీసీ ఎన్నిక బరిలో ఉండటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు.
పోలింగ్ బూత్ మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందా అని అనిత ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరిగిన ప్రక్రియపై వైసీపీ నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధి, ఎన్నికల సంఘం అధికారాలపై ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్‌కు కనీస అవగాహన లేక పోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. నెలలో 20 రోజులు బెంగుళూరులో ఉంటూ గంజాయ్, బ్లేడ్ బ్యాచ్‌లను కలిసేందుకు వచ్చే జగన్‌కు వాస్తవ పరిస్థితులు ఏం తెలుస్తాయని ఆమె ఎద్దేవా చేశారు.
జగన్ హయాంలో జరిగినట్లు ఎక్కడైనా నామినేషన్లు ఎవరైనా లాక్కున్నారా? వైసీపీ హయాంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు చేర్చినట్లు పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో ఎక్కడైనా చేర్చారా అంటూ మంత్రి వంగలపూడి అనిత వ్యంగ్యంగా ప్రశ్నించారు. తల్లి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టులో కేసు వేసిన వాడిని ఎలా నమ్మాలనే ఆలోచనలో పులివెందుల ప్రజలు ఉన్నారంటూ జగన్‌కు ఈ సందర్భంగా ఆమె చరకలంటించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లోని ప్రజలు.. ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ సునీతకు కావాల్సిన సాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె తండ్రిని కిరాతకంగా సొంత మనుషులే చంపారన్న వైఎస్ సునీత బాధను అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.