- ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు
- అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్రానికి పంపుతాం
- లోకాయుక్త, హెచ్ఆర్సీ కర్నూలులోనే ఉంటాయి
- యువగళం హామీమేరకు మిషన్ రాయలసీమను సాకారం చేస్తాం
- సీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదు
- మూడు రాజధానుల పేరిట మూడుముక్కలాడారు
- రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉంది..
- శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం
అమరావతి (చైతన్య రథం): ఎన్నికలముందు కూటమిచ్చిన హామీమేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. హైకోర్ట్ బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు ‘లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కార్యాలయాల తరలింపు ఉండదు. అవి కర్నూలులోనే ఉంటాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖ, సీమలో కర్నూలు, తిరుపతి పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడు ముక్కలాటలాడి ఏ ప్రాంతం అభివృద్ధి కాకుండా చేశారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మేము విశాఖ, కర్నూలులో కూడా అమరావతే రాజధాని అని ఆ ప్రాంత ప్రజలను ఒప్పించాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం… మళ్లీ చేసి చూపిస్తాం. రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆలోచించి కృష్ణా జలాలను సీమకు తరలించాలని ఆలోచించింది ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తెలుగుగంగ, హంద్రీనీవా, నగరి గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారు. వాటిని పూర్తి చేసేది కూడా ఎన్డీయేనే. నదుల అనుసంధానం చేసి, పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకెళ్తే గేమ్‌ఛేంజర్ అవుతుంది. కియా పరిశ్రమను తీసుకొచ్చేందుకు యేడాదిలోనే గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. కియా రాకతో అనంత జిల్లా ముఖచిత్రం మారిపోయింది. హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే మహర్దశ పడుతుంది. అనంతపురానికి బెంగళూరు ఎయిర్‌పోర్టు, కర్నూలుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్ పోర్టులు దగ్గరగా ఉన్నాయి. ఈ మూడు అవకాశాలను అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. సీమలోనూ మంచి రోడ్లు వచ్చాయంటే టీడీపీ హయాంలోనే. ఓర్వకల్లులో ఎయిర్‌పోర్టు పెట్టాం. తిరుపతి ఎయిర్‌పోర్టును విస్తరించి సర్వీసులు పెంచేలా చేశాం. కడప ఎయిర్‌పోర్టులో రాత్రి సమయంలోనూ విమానాలు దిగే అవకాశం కల్పించాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో నాలుగు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా సీమను మార్చుతాం
రాయలసీమలో విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చాం. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతున్నాం. తిరుపతి ఐఐటీ, ఐసర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ వర్సీటీ పెట్టి ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాం. యువగళంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతాం. హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు 90 శాతం రాయితీతో డ్రిప్ సబ్సీడీ ఇచ్చాం.. కానీ గత ప్రభుత్వం దాన్నీ రద్దు చేసింది. మళ్లీ రాయితీతో డ్రిప్‌ను రైతులకు అందిస్తాం. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు. తిరుపతి హార్డ్‌వేర్ హబ్‌గా మారింది టీడీపీ హయాంలోనే. కేంద్రం రెండు ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే వాటిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేశాం. వీటి అభివృద్ధికి రూ.5 వేల కోట్లు మంజూరయ్యాయి. ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించాం. కర్నూలను బెస్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.