- క్షుణ్ణంగా తనిఖీలు, విస్తృంగా సోదాలు
- ఉగ్రదాడులపై మాక్ డ్రిల్
తిరుమల (చైతన్యరథం): జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్‌రోడ్డులో పలు చోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజ్‌లను తనిఖీ చేస్తున్నారు. ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులందరినీ భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, భక్తులను కూడా సెర్చ్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డు, తిరుమలలో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పలు చోట్ల సోదాలు చేపడుతున్నారు. భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. అందులో ఏదన్నా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే విచారించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్నారు. అటు తిరుమలలో కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు. పహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో తిరుమల మొత్తం కూడా హైఅలర్ట్ జారీ చేశారు.
తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్
కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రతా విభాగం పోలీసులకు, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్‌లో 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 మంది ఏపీఎస్పీ సిబ్బంది భాగమయ్యారు.ఈ కార్యక్రమంలో వీజీవోలు రామ్ కుమార్,సురేంద్ర, డీఎస్పీ విజయ శేఖర్, ఏవిఎస్‌ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.