- వారసత్వ పర్యాటక అభివృద్ధికి సహకరించండి
- క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిక్షణ, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహిద్దాం
- విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రితో భేటీలో మంత్రి లోకేష్
ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్): విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లో పాపికొండలు, విశాఖ బీచ్‌వంటి సుందరమైన ప్రదేశాలున్నాయి. గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండిరగ్‌కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించండి. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్‌పై కలిసి పనిచేయండి అని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో 1053 కి.మీ.ల సువిశాల తీరం ఉంది. విక్టోరియా పోర్టు ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీలో తీరప్రాంత స్థితిస్థాపకతపై ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి.
విక్టోరియా సర్క్యులర్ ఎకానమీకి చేయూతనిస్తున్న వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజం తరహా ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయండి. విక్టోరియా మెల్‌బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ ఈవెంట్ల నిర్వహణకు సహకారం అందించండి. ఏపీలోని ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిపుణులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలంటూ లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్/ విక్టోరియాలలో క్రికెట్, హాకీవంటి క్రీడలకు సంబంధించి ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్‌లు నిర్వహించాలని సూచించారు. స్పోర్ట్స్ సైన్స్‌పై ఏపీ-విక్టోరియా నడుమ స్టూడెంట్ ఎక్స్చేంజి కార్యక్రమాలకు సహకారం అందించండి. విక్టోరియా అడ్వెంచర్ టూరిజం గవర్నెన్స్ (ఆల్పిన్ నేషనల్ పార్క్) తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ట్రెక్కింగ్), పులికాట్ (వాటర్ స్పోర్ట్స్) అభివృద్ధికి చేయూతనివ్వండి. విక్టోరియా సంస్థల ద్వారా అడ్వెంచర్ గైడ్స్/ రేంజర్ల సర్టిఫికేషన్, నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి. విక్టోరియాలోని ఆఫ్ షోర్ విండ్, సోలార్ రెన్యువబుల్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో యువతకు గ్రీన్ జాబ్స్‌పై స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.














