- పద్మజ భౌతిక కాయం వద్ద సీఎం చంద్రబాబు నివాళి
- కుటుంబ అనుబంధాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు
హైదరాబాద్ (చైతన్య రథం): నందమూరి పద్మజ భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జయకృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పద్మజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మా పెళ్లి విషయంలో జయకృష్ణ, పద్మజ పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకున్నారు. ఇంట్లో అందరూ యంగ్ స్టర్స్ ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే కుటుంబ పెద్దగా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందడం చాలా బాధేస్తోంది. అందరికంటే జయకృష్ణకు తీరని లోటు. ఎన్టీఆర్ కుటుంబంలో మొదట నాకు పరిచయం జయకృష్ణతోనే. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు.. ఎగ్జిబిటర్‌గా ఆయన నా దగ్గరికి వచ్చే వారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను కలవడం.. అవన్నీ జరిగాయి. అన్ని విషయాలు ముందుండి ఆలోచించింది జయకృష్ణ. ఆయన కుటుంబానికి అందరం అండగా ఉంటాం’’ అని చంద్రబాబు తెలిపారు. పద్మజ… దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సోదరి. పద్మజ భౌతికకాయానికి నటుడు నందమూరి బాలకృష్ణ నివాళి అర్పించారు. తనకు ఆమె తల్లి తర్వాత తల్లిలాంటివారని బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు.