- సమస్యలు ఉంటే కలిసికట్టుగా పరిష్కరించుకుందాం
- కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం
- కూటమి ధర్మం పాటించే బాధ్యత మేం తీసుకుంటాం
- పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా
- పార్టీలో నిరంతరం యువరక్తం పారాలి
- ఖర్చుల కోసం రాజకీయాలపై ఆధారపడాల్సిన అవసరం మాకు లేదు
- యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్
యలమంచిలి (చైతన్యరథం): కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు కాదు.. సమస్యలు పరిష్కరించేందుకు వచ్చానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సోమవారం మంత్రి లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ విధ్వంస పాలనపై అందరం కలిసికట్టుగా పోరాడి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94శాతం స్ట్రైక్ రేట్‌తో 164 సీట్లు సాధించాం. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని సీఎం చంద్రబాబునాయుడు అంటున్నారు. ఈ రోజు పార్టీలో చాలా మార్పు వచ్చింది. యువకులకు అవకాశం కల్పించాం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అధినేతలు అనే మాటను శిరసావహిస్తూ.. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నాం. వారి సమస్యలను తెలుసుకుంటున్నాం. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. చంద్రబాబునాయుడు కూడా కార్యకర్తలను కలుస్తున్నారని మంత్రి లోకేష్ చెప్పారు.
రికార్డులు సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా టీడీపీతోనే సాధ్యం
దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటి మంది సభ్యత్వాలతో టీడీపీ చరిత్ర సృష్టించింది. నేను ఎక్కడికి వెళ్లినా సభ్యత్వం గురించే అడుగుతున్నారు. రికార్డులు సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా టీడీపీతోనే సాధ్యం. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ప్రారంభించాం. ఆపదలో ఉన్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాం. ఆనాటి కాంగ్రెస్ పాలనలో అనంతపురంలో టీడీపీ కార్యకర్త ఒకరిని ఆయన పిల్లల ముందే హత్య చేశారు. ఆ టీడీపీ కార్యకర్త పిల్లలను దత్తత తీసుకుని చదివించాం. నేడు వారు ఐబీఎం వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ సుమారు రూ.140 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు ప్రమాదబీమాను రూ.5 లక్షలకు పెంచాం. కార్యకర్తలకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కార్యకర్తలు సొంత కాళ్లపై నిలబడేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తాం. హెరిటేజ్ ఆ విధంగానే వృద్ధిపథంలోకి వచ్చింది. మా ఖర్చుల కోసం రాజకీయాలపై ఆధారపడాల్సిన పనిలేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
సమస్యలు ఉంటే కలిసికట్టుగా పరిష్కరించుకుందాం
మహానాడు నాటికి అన్ని కమిటీలను పూర్తిచేయాలి. మన పార్టీలో పెద్ద జబ్బు ఉంది. అదే అలక. మనం అందరం కుటుంబ సభ్యులం. సమస్యలు ఉంటే కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కరించుకుందాం. ప్రతి బుధవారం కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి సమావేశం నిర్వహించాలి. గురువారం సదరు ఇన్‌ఛార్జి.. ఎమ్మెల్యేతో చర్చించాలి. కూటమి ధర్మం ప్రకారం యలమంచిలి సీటును జనసేనకు కేటాయించాం. కూటమికి 58శాతం ఓట్లు వచ్చాయి. చిన్న, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలి. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పీకిందేమీ లేదు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్దఎత్తున విన్నవిస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. తెలుగువారు ఎక్కడున్నా నెం.1 స్థానంలో ఉండాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి లోకేష్ సూచించారు.
కూటమి ధర్మం పాటించే బాధ్యత మేం తీసుకుంటాం
నియోజకవర్గ పర్యటనల్లో పోలీసులు వద్దన్నా వస్తున్నారు. ఇదే పోలీసులు గతంలో చంద్రబాబునాయుడిని గేటు దాటనివ్వలేదు. రామతీర్థం వస్తుంటే పోలీసులే టిప్పర్లు అడ్డుపెట్టిన పరిస్థితి. చేయని తప్పునకు చంద్రబాబుని 53 రోజుల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారు. నా యువగళం పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్నారు. నాపై 23 కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని కష్టకాలాన్ని మర్చిపోకూడదు. కలిసికట్టుగా పనిచేయాలి. కూటమి ధర్మం అందరూ పాటించాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో కూటమి ధర్మం పాటించే బాధ్యత తీసుకుంటాం. సమస్యలు ఉంటే కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి. మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా
పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా. పార్టీలో నిరంతరం యువరక్తం పారాలి. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒక మండల పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు కాకూడదు.. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భరోసా ఇచ్చేందుకు రాలేదని.. సమస్యలు పరిష్కరించేందుకు వచ్చానని చెప్పారు. అనంతరం ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి వంగలపూడి అనితతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం
అంతకుముందు విశాఖ నుంచి అచ్యుతాపురం బయలుదేరిన మంత్రి నారా లోకేష్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. గాజువాక సెంటర్, అనకాపల్లి బైపాస్ వద్ద పార్టీ జెండాలు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్ ఆపి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారితో కలిసి ఫోటోలు దిగారు.