- జగన్ హయాంలో అభివృద్ధి ఊసే లేదు
- కూటమి పాలనపై విషం కక్కుతున్నారు..
- ప్రజాభీష్ట ప్రభుత్వంపై ఎందుకంత కక్ష
- సొంత మీడియా సాక్షిలో అన్నీ అసత్యాలే
- నిప్పులు చెరిగిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా
- చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షమని వ్యాఖ్య
అమరావతి (చైతన్య రథం): వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి డోలా మాట్లాడుతూ… ‘2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. ఒక అరాచక శక్తిని తరిమికొట్టారు. రాష్ట్ర ప్రజలపై వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశమిచ్చారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఐదేళ్ల అభివృద్ధి చేసి చూపించాం’ అన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్‌ను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని, వైసీపీ మాత్రం వెయ్యి రూపాయలు పింఛను పెంచుతామన్న హామీ అమలు చేయడానికి ఐదేళ్లు ఆపసోపాలు పడిరదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు, బకాయిలే మిగిల్చినా.. రూ.4 వేలకు పెంచిన పింఛన్ పథకాన్ని అరియర్స్ సహా అందించి కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దేశంలో ఏరాష్ట్రం ఇవ్వని విధంగా వికలాంగులకు 6వేలు, మంచానికే పరిమితమైనవారికి రూ.15వేలు పింఛను ఇస్తున్న ప్రభుత్వం ఒక్క కూటమి ప్రభుత్వమేనన్నారు. ఆడపడచుల కష్టాలు తీర్చడానికి దీపం పథకం-2 ద్వారా 3 ఉచిత గ్యాస్ కనెక్షన్లు 90 లక్షల కుటుంబాలకు ఇస్తుంటే.. చూసి ఓర్వలేని వైసీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం అమలుకు అడ్డుతగులుతున్న వైసీపీని ప్రజలు తిప్పికొడుతున్నా బుద్ధి రావడం లేదని మంత్రి డోలా వ్యాఖ్యానించారు. అన్నా క్యాంటిన్లు ఎలా మూసేస్తారని అప్పట్లో అసెంబ్లీలో లేవదీస్తే.. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గుర్తు చేస్తూ.. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారన్నారు. అదనంగా అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు కేబినెట్లో నిర్ణయించారని, త్వరలోనే అమలవుతుందన్నారు. ‘వైసీపీ నాయకులకు ఇవన్నీ కళ్లకు కనిపించవు, చెప్పినా వినిపించవు. మీ నాయకుడి మెప్పు కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మిమ్మల్ని వదిలేసి బయటికి వస్తున్నారు. వైసీపీ నాయకుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వైసీపీ నాయకులు చేసిన గుంతల రోడ్లను మేం పూడుస్తూ వస్తున్నాం. మీ గుంటల రోడ్లమీద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు మీ కళ్లకు కనిపించడంలేదా? 6 నెలల వార్తలను ఈరోజు జరిగినట్లుగా సాక్షి పత్రికలో వేసుకుంటారు. సాక్షిలో వచ్చేవన్నీ అసత్య ఆరోపణలే. సాక్షి మీడియా చూసేవారే అసహ్యించుకుంటున్నారు. అమ్మఒడి అని చెప్పి మొదటి ఏడాది ఇవ్వకుండా వదిలేశారు. ఐదేళ్లూ కంటిన్యూగా ఇవ్వలేదు. ఇద్దరు పిల్లలకు ఇస్తామని ఆశపెట్టి మాటతప్పి మోసం చేసింది గుర్తు లేదా?’ అని నిలదీశారు. వైసీపీ ఇప్పటికీ వాస్తవ ప్రపంచంలో బతకడంలేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ మాదిరిగా మాటిచ్చి మడమ తిప్పే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉండదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం అహరహం కృషి చేస్తుందని మంత్రి డోలా స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జగన్‌లా పరదాల మాటున దాక్కోవడం, చెట్లు కొట్టించేయడం, గాల్లో చక్కర్లు కొట్టడంలాంటివి చేయలేదు. ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. నిరుద్యోగాన్ని పారదోలుతామన్న వైసీపీ ఒక్క డిఎస్పీ కూడా వేయలేకపోయింది. మేం వచ్చి డిఎస్సీపై సంతకం చేశాం. త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే 16 వేల మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నాం’ అని డోలా వివరించారు. పెట్టుబడులు తెచ్చి 9వేల ఉద్యోగాలిచ్చామని వైసీపీ చెప్పుకుంటోంది. మేము సుమారుగా ఏడు నెలల్లోనే 6 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చాం. 4 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. వైసీపీ మాదిరి కల్లబొల్లి మాటలు చెప్పడంలేదు. స్వయంగా ప్రధానే వచ్చి విశాఖపట్నంలో శంఖుస్థాపనలు చేశారు. రైల్వే జోన్ తీసుకొచ్చాం. రైల్వే జోన్ ఆఫీస్‌కు శంఖుస్థాపన చేశామని మంత్రి డోలా స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి కేబినెట్లో తీర్మానం చేశామని, గౌడ కులస్థులకి మద్యం షాపుల్లో 10 శాతం రాయితీతో షాపులిస్తున్నామని, గంజాయిరహిత రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తున్నామని, లా అండ్ ఆర్డర్‌ను పూర్తిగా కంట్రోల్లో పెట్టామన్నారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్టు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు పెట్టింది పేరని అంటూ.. 2047 నాటికి ప్రతి కుటుంబం సాధికారత సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు రూ.143 కోట్ల బడ్జెట్ ఇచ్చి మరమ్మతులు చేస్తున్నామని, కనీసం రూ.25 కోట్లు వైసీపీ ఇవ్వలేకపోయిందని డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ పాలన సాగించిన వైసీపీ.. కూటమిపై బురదజల్లే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలన్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హెచ్చరించారు.