- కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం
- ఏడాదిలో జరిగిన అభివృద్ధి కనిపించడంలేదా?
- గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించింది
టెక్కలి (చైతన్యరథం): సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రజల్దరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలోని మర్లపాడు, కవిటి అగ్రహారం గ్రామాల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని వివరిస్తూ..కరపత్రాలు పంపిణీ చేశారు. రూ. 1.08 కోట్ల రూపాయలుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పరుగులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్ల కింద సంవత్సరానికి రూ.34 వేల కోట్లు అందిస్తున్నామని తెలిపారు. మత్య్సకార భరోసా కింద రూ.250 కోట్లు ఇచ్చామని, తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది లబ్ధిదారులకు పథకం అందచేశామన్నారు. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వాటి పరీక్షలు పూర్తిచేశామని, మరి కొద్ది రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5లకే పేదవాడి ఆకలి తీరుస్తున్నామని, రూ.4 వేలు వృద్దాప్య , వితంతు పింఛన్లు అందిస్తున్నామని, రూ. 6 వేలు దివ్యాంగ పింఛన్లు, డయాలసిస్ రోగులకు రూ.10 వేలు అందిస్తున్నామని, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు కూటమి ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు ఇస్తుందని. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతులకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
వైసీపీ నేతల విష ప్రచారం
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్నా భిన్నం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనీసం గ్రామాల్లో తట్టెడు మట్టి తీసి అభివృద్ధి చేయని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరికీ అమ్మ ఒడి పథకం అని చెప్పి ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చి మొండిచేయి చూపారన్నారు.అదికూడా మూడు సంవత్సరాల మాత్రమే ఇచ్చారని, రైతు భరోసా పేరిట రూ.12,500 ఇస్తామని, రూ.7500 మాత్రమే ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. వివిధ కారణాల చూపి రాష్ట్రంలో 3.5 లక్షల మంది పింఛన్లు తొలగించారని, వాటిని త్వరలో మంజూరు చేస్తామని చెప్పారు.