- దసరాలోగా చేనేత సహకార ఎన్నికలు
- త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు
- రూ.5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్ నిధులూ విడుదల చేస్తాం
- 3 నెలలకోసారి ఆప్కో ద్వారా చేనేత దుస్తుల కొనుగోలు
- ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో చేనేతలకు పెద్దపీట
- వారానికోసారి చేనేత దుస్తుల ధరించడంపై విస్తృత ప్రచారం
- సీఎం చంద్రబాబుతోనే చేనేతలకు స్వర్ణయుగం
- రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి సవిత
విజయవాడ (చైతన్య రథం): దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు చేయనున్నామన్నారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడలో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి సవిత బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేనేతరంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేతల అభివృద్ధికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. నూతన డిజైన్ల తయారీలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తయారైన ఉత్పత్పులకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మినీ కస్టర్లు, మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, నూతన టెక్స్‌టైల్స్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 92,724 మందికి రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు.
దసరాలోగా సహకార సంఘ ఎన్నికలు
చేనేత సహకార సంఘాల బలోపేతానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారని మంత్రి సవిత వెల్లడిరచారు. దీనిలో భాగంగా సహకార సంఘ ఎన్నికలు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. నూతన చేనేత సహకార సంఘాల ఏర్పాటుతోపాటు నిద్రావస్థలో ఉన్న సంఘాలను క్రీయాశీలకంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
3 నెలలకోసారి ఆప్కో ద్వారా కొనుగోలు
నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం నేతన్నల నుంచి ఆప్కో ద్వారా ఆరు నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇకపై మూడు నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడిరచారు. నేతన్నలకు బకాయిలను కూడా విడతలవారీగా చెల్లించనున్నామన్నారు. త్రిఫ్ట్ పథకం కింద కేటాయించిన రూ.5 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో చేనేతలకు పెద్దపీట
ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ పార్కుల్లో యూనిట్ల స్థాపనకు నేతన్నలకే పెద్దపీట వేస్తున్నామన్నారు. వర్క్ షెడ్ల ఏర్పాటుకు చేయూతనందిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో చేనేతలకు అదనంగా రూ.50 వేలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. హైదరాబాద్‌లో ఉన్న ఎన్.హెచ్.డి.ఎస్. రీజనల్ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు. 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందజేస్తామని, సీఎం చంద్రబాబుతోనే చేనేతలకు స్వర్ణయుగమని మంత్రి సవిత తెలిపారు.
వారానికోసారి చేనేత దుస్తుల ధరించడంపై ప్రచారం
చేనేత అమ్మకాలు పెరిగేలా కూటమి ప్రభుత్వం రాష్ట్రంతోపాటు జాతీయస్థాయిలోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోందని మంత్రి సవిత వెల్లడిరచారు. చేనేత దుస్తులకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నాయన్నారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు వారంలో ఒకరోజు చేనేత దుస్తులు తప్పనిసరిగా ధరించేలా రెండు ప్రభుత్వాలు త్వరలో పిలుపునివ్వనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి నిధులు కేటాయింపు పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ చేనేత రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్స్‌శాల మాదిరిగా అన్ని జిల్లాల్లోనూ వీవర్స్‌శాలలు ఏర్పాటు చేసి కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో 2.5 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.
చేనేతలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ-కామర్స్ మాద్యమంలో అమ్మకాలు జరపడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. నూతన డిజైన్ల కోసం స్థానిక చేనేత కార్మికుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. సంచార వాహనాల ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత మరియు జౌళీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో నిరంతరం పని కల్పించి మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామన్నారు. చేనేత సహకార సంఘాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌ను మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అధికారులు సందర్శించారు. ధరలు, నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి, సెర్ప్ సీఈవో కరుణ, ఆప్కో వీసీ అండ్ ఎండీ ఎం.విశ్వ, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ అబద్దయ్య, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.