- త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు
- మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి
- మరుగున పడిన కళలకు జీవం పోస్తున్నాం
- రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత
అమరావతి (చైతన్యరథం): హస్తకళలు, కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని.. త్వరలో విదేశాల్లోనూ ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి ఎస్.సవిత వెల్లడిరచారు. శుక్రవారం విజయవాడ, పటమటలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షీ గాంధీ శిల్ప బజార్‌ను మంత్రి సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ హెచ్‌డీసీ) లిమిటెడ్ వీసీ, ఎండీ ఎం.విశ్వ, విజయవాడ ఆర్డీవో కె.చైతన్య, టీడీపీ నాయకురాలు తిరునగరి జ్యోత్స్న, తదితరులతో కలిసి ప్రారంభించారు. డిసెంబర్ 1వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో దాదాపు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు 100 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కళానైపుణ్యంతో తయారుచేసిన వస్తువులను ప్రదర్శన, అమ్మకాలకు అందుబాటులో ఉంచగా.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సవిత తిలకించారు. ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జువెలరీ, కార్పెట్స్, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, టై అండ్ డై చీరలు, ఉడ్ కార్వింగ్, లేస్ బ్యాగులు, డ్రెస్ మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు, తదితరాలతో ఏర్పాటు చేసిన స్టాళ్ల ఏర్పాటుదారులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం మేరకు మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషిచేస్తోందని, మరుగునపడిన కళలకు జీవం పోస్తోందని పేర్కొన్నారు. హస్తకళలను, చేనేతను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కకరిపైనా ఉందన్నారు. చేయిచేయి కలిపి స్వర్ణాంధ్ర` 2047 సాధనకు కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఐదు నెలల కాలంలోనే మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మూడు ప్రదర్శనలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో లేపాక్షి, ఆప్కో, చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయని వివరించారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో త్వరలో లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేస్తామని.. అదే విధంగా తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని ఎంపోరియంలను ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని.. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ఎండీ ఆర్.పవనమూర్తి, చేనేత, జౌళి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.