- పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
- నారా భువనేశ్వరి ఉద్బోధ
కుప్పం (చైతన్యరథం) పిల్లలను ఉత్తమ విద్యావేత్తలుగా, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి మెగా డీఎస్సీలో ఎంపికై ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులతో గురువారం భువనేశ్వరి సమావేశమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన కోచింగ్ సెంటర్ నుంచి మెగా డీఎస్సీకి ఎంపికైన 20మంది ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు..
కుప్పం నియోజకవర్గం నుంచి 117 మంది మెగా డీఎస్పీకి ఎంపిక అవ్వటం సంతోషంగా ఉందన్నారు. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు మీ చేతిలో పెడతారని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే అని ఉద్బోధించారు. ఉపాధ్యాయులను దేవుడితో సమానంగా పోలుస్తారని గుర్తుచేశారు. వైసీపీ పాలన ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని విమర్శించారు. ఆ ఐదేళ్లు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే మన రాష్ట్రం ఎంతో ఉన్నత స్థానంలో ఉండేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతరం కష్టపడుతున్నారని భువనేశ్వరి అన్నారు.












