- సమస్యలెన్నున్నా.. మేనిఫెస్టోపై వెనకడుగు లేదు
- ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి
- మే నుంచి తల్లికి వందనం పథకం అమలు
- కేంద్రం సాయంతో మూడు విడతల్లో ‘అన్నదాత’కు రూ.20 వేలు
- వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు
- వచ్చే విద్యా సంవత్సరంలోగా డీఎస్సీ పూర్తిచేసి పోస్టుల భర్తీ
- అభివృద్ధి, సంపద సృష్టి, సంక్షేమం, సాధికారత.. సక్సెస్ మోడల్
- సుస్థిర ప్రభుత్వంతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యం
- సభా సంప్రదాయాలు విస్మరించడం.. అనైతిక చర్య
- ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాననడం సమంజసమా?
- దేశ చరిత్రలో వైసీపీ నిరసన నీతిబాహ్యమైన చర్య
- అయినా.. ప్రతిపక్ష హోదా ప్రజలివ్వాలి… ప్రభుత్వం కాదు
- అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
- గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
- ‘సూపర్-6’ అమలుపై అసెంబ్లీలో సీఎం షెడ్యూల్ విడుదల
అమరావతి (చైతన్య రథం): ‘ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి హామీనీ నెరవేర్చుతాం. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాల అమలుపై శాసనసభలో షెడ్యూల్ విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సంప్రదాయాలు మరచి, నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా? అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేంకాదని, ప్రజలని స్పష్టం చేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం మూడు పార్టీలు కలిసి పోటీ చేయలేదని, దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమని భావించామన్నారు. స్వర్ణాంధ్ర `విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర సహకారం మరువలేనిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
చిత్తశుద్ధితో హామీలు నెరవేరుస్తాం
‘ఎన్నికల హామీలు నెరవేర్చడానికి రేయింబవళ్లు పనిచేస్తాం. అధికారం చేపట్టగానే రూ.3000 వేలు పింఛను రూ.4000 వేలు చేశాం. 8 లక్షల 8 వేల 570 మంది దివ్యాంగులకు గత ఐదేళ్లలో ఒక్క పైసా కూడా పింఛను పెంచలేదు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే రూ.3 వేలనుంచి రూ.6 వేలు చేశాం. డయాలసిస్ రోగులకు రూ.10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. మన దేశంలో ఒక్క పెన్షన్ల కింద ప్రతి ఏటా 64 లక్షల మందికి రూ.33 వేల కోట్లు వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వమే. సేవాభావంతోనే ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను ఇస్తున్నాం. గత ఐదేళ్లలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు 1నే జీతాలిస్తోంది. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం నిలిపేసింది. 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. 48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు రీ పే చేస్తున్నాం. ఇందుకోసం రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నాం. దీపం పథకం కింద కోటిమంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. 93 లక్షలమందికి గ్యాస్ సిలిండర్లు అందించాం. సమైక్యాంధ్రలో నేను దీపం పథకం తెచ్చాను. ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా వంటగ్యాస్ ఇస్తున్నాం. డీఎస్సీ ఇప్పటికే ప్రకటించాం. రానున్న విద్యా సంవత్సరం 16,354 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. మే నెలలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుడతాం. ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం వర్తింపజేస్తాం. రైతు భరోసా కింద కేంద్రమిచ్చే రూ.6000కు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.14,000 కలిపి మూడు వాయిదాల్లో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
సభకు రావాలంటే ‘హోదా’ ఇవ్వాలనడం ఎక్కడి సంస్కృతి?
గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. వ్యవస్థ నిర్వీర్యమైంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని భావించాం. నేను ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను. నేను 4వ సారి ముఖ్యమంత్రినయ్యాను. మూడుసార్లు పెద్దగా ఇబ్బందులు లేవు. ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి. సకాలంలో స్పందించి రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని మోదీని అభినందిస్తున్నాను. నేను 9సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అప్పట్లో రోడ్లు కూడా ఉండేవి కాదు. ఎమ్మెల్యేకి కేవలం మిలటరీ జీపు, 3 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేవారు. నేను గౌరవంగా జరిగిన సభలు చూశాను. కానీ గత ఐదేళ్లలో సభలు ఎలా జరిగాయో అందరూ చూశారు. కౌరవసభను గౌరవసభగా చేస్తానని నేను చెప్పాను. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాం, అసెంబ్లీ జరగనిస్తామని చెప్పడం నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నా. నిన్నటిరోజు చీకటి రోజు. ప్రజలు 11మందినే గెలిపించారని.. 11 గంటలకు వచ్చారు. 11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారు. కేవలం 11 నిమిషాలు ఉండి స్పీకర్‌ని కూడా అవమానించారు. ప్రజలు ఎన్నుకుంటేనే మనం సభలోకి వస్తాం. ముఖ్యమంత్రులు ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కేజ్రీవాల్ ఎమ్మెల్యేగానూ గెలవలేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాననడం దేశంలో ఎక్కడా జరగలేదు. సంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. హోదా మీరో నేనో ఇచ్చేది కాదు… ప్రజలు మాత్రమే ఇచ్చేదని గుర్తెరగాలి’ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో సూచించారు.
15 శాతం వృద్ధి రేటు లక్ష్యం
అభివృద్ధి చేయాలి. సంపద సృష్టించాలి. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. దాన్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయాలి. సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి ఖర్చు చేయడం సరికాదు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకుపోతున్నాం. 2047నాటికి 42 వేల యూఎస్ డాలర్ల పర్ క్యాపిటల్ ఆదాయం సాధించాలి. ఏపీలో 2047కి 42 వేల డాలర్ల తలసరి ఆదాయం తీసుకురావాలన్నది లక్ష్యం. ఇది సాకారం కావాలంటే 15 శాతం వృద్ధి రేటు ఉండాలి. 2014-19లో వృద్ధి రేటు 13.5 ఉంది. వైసీపీ హయాంలో 10 శాతానికి దిగజారింది. మోదీ నాయకత్వంలో 2047నాటికి దేశం నంబర్ వన్‌గా నిలుస్తుంది. అప్పటికి ఏపీని నెంబర్ వన్ చేయాలన్నది నా ఆలోచన. సుస్థిర ప్రభుత్వాలతో స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ `2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు.
వడ్డెరలకు క్వారీల్లో 10 శాతం రిజర్వేషన్లు
పేదరికం లేని సమాజమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు మళ్లీ తెచ్చేందుకు సబ్‌కమిటీ వేసి అధ్యయనం చేస్తున్నాం. చట్ట సభల్లో 33శాతం రిజన్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాము. గీత కార్మికులను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు మద్యం షాపుల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేశాం. అదనంగా రూ.50 వేలు ఇంటికిచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. వెనుకబడినవర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతికి తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఐదేళ్లలో మద్యం మాఫియా నడిపారు. నాశిరకం బ్రాండ్లు తెచ్చారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రక్షాళన చేశాం. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన మద్యం పాలసీ తెచ్చింది ఏపీ ప్రభుత్వమే. అర్చకులకు రూ.10 వేలనుంచి రూ.15 వేలకు జీతాలు పెంచాం. దూప, దీప నైవేద్యాల కింద ఆలయాలకు రూ.5 వేలనుంచి రూ.10 వేలకు పెంచాం. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతికింద రూ.3 వేలు ఇస్తున్నాం. దేవాలయాల పవిత్రత కాపాడతాం. తిరుమల ప్రసాదంలో నాశిరకం ప్రసాదంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఎక్కడా అపవిత్రతకు చోటివ్వం. గత ప్రభుత్వంలో రాముని విగ్రహం తల ధ్వంసం చేశారు. ప్రశ్నిచిన మాపై కేసులు పెట్టారు. అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుని చేయి విరిగితే బొమ్మేకదాని అవహేళన చేశారు. ప్రార్థనాలయాల జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటాం. నాయి బ్రాహ్మణుల జీతాలు రూ.15 వేలనుంచి రూ.25 వేలకు పెంచాం. ఇమాములు, మోజోములకు గౌరవ వేతనం రూ.15 వేలు చేశాం. గత ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీలకు రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు మనసు రాలేదు. సబ్ ప్లాన్ ఆపేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి జాగా, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఐదేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇప్పటికే లక్షా 14 వేల ఇళ్లు నిర్మించాం. ఈ ఏడాది జూన్ 12నాటికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అప్పటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తాం. ప్రతి వ్యక్తికీ ఇల్లు, మంచినీరు, మరుగుదొడ్లు, సోలార్ పవర్, కరెంటు కనెక్షన్, గ్యాస్, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తాం. పేదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. ఉగాది రోజున పీ`4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. పీ`4 తో సంపద సృష్టిస్తాం. పేదరికం నిర్మూలిస్తాం. సంపద కొందరికే పరిమితం అవడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న 73 కార్యక్రమాలు రూ.10వేల కోట్లతో జరుగుతున్నాయి. సర్వే రాళ్లపై రూ.650 కోట్లు ఖర్చు చేశారు. వాటిపై బొమ్మలు వేసుకున్నారు. ఆ బొమ్మలు తీయడానికి రూ.30 కోట్లు ఖర్చయింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేశారు. చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలకు, గుడులకు, చెట్లకు కూడా పార్టీ రంగులు వేశారు. పట్టాదారు పాసుపుస్తకాలపైనా బొమ్మలు వేశారు అంటూ వైసీపీ అనైతిక పాలనా విధానాలను చంద్రబాబు తూర్పారబట్టారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇప్పటికే రూ.6 లక్షల 50 వేల కోట్ల ఎంవోయూలు సాధించామని, దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ఎన్టీపీసీ, జెన్‌కో ఆధ్వర్యంలో రూ.2లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించారు. రామాయపట్నంలో రూ.95 వేల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు. నక్కపల్లిలో ఫార్మా, కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, కడపలో 4 ఇండస్ట్రియల్ పార్క్‌లు మంజూరయ్యాయి. తద్వారా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తయారుచేయబోతున్నాం. ఎనర్జీ సెక్టార్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7 లక్షల 50 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వోద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తాం. విశాఖలో గూగుల్ రాబోతోంది. టీసీఎస్ ద్వారా 10 వేల ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తాం. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.788 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం విద్యాశాఖలో రూ.6,500 కోట్లు బకాయిలు పెట్టింది. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రులు పవన్ కల్యాణ్, లోకేష్‌ను అభినందిస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యామిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్కూల్ కిట్స్ అందిస్తున్నారు. ప్రజలకు, జాతికి సేవ చేసిన వారి పేర్లను పథకాలను పెడుతున్నాం. మెగా టీచర్లు- పేరెంట్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.1770 కోట్లు కేటాయించాం. ఇంకా ఇవ్వాల్సి ఉంది. డిజిటల్ హెల్త్ కార్డులపై వర్కవుట్ చేస్తున్నాం. ఇందులో మనం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాం. ఎన్టీఆర్ వైద్యసేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు సాయం చేస్తున్నాం. వైద్య ఖర్చుల విషయంలో మధ్యతరగతి ఇబ్బందులు పడుతున్నారు. కనుక రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తాం. ప్రీమియం చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు.
సముద్రంలో వృథాగా కలిసే నీటిని వినియోగించుకుంటే అద్భుతం
పోలవరం ఏపీ జీవనాడి. తెలుగువారి కల. గోదావరిలో 2 వేల టీఎంసీ నీరు సముద్రంలోకి పోతోంది. ఈ ఏడాది 4 వేల టీఎంసీ నీరు సముద్రంలోకి పోయింది. 2014-19 మధ్య మేము 73 శాతం పోలవరం పనులు పూర్తిచేశాం. 2019లో మేమే అధికారంలోకి వస్తే పోలవరం పూర్తిచేసేవాళ్లం. గత ఐదేళ్లలో పోలవరాన్ని నిలిపేశారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరానికి రూ.12,150 కోట్ల నిధులిచ్చిన ప్రధాని మోదీని అభినందిస్తున్నాను. గత ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి రంగానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారే కానీ పూర్తి చేయలేదు. కుప్పానికి నీరు తెచ్చామని రెడీమెడ్ సినిమా సెట్టింగ్ వేశారు. నిజ జీవితంలోనూ సెట్టింగులు వేయొచ్చని గత పాలకులు నిరూపించారు. ఇలాంటి విన్యాసాలు చాలా చేశారు. కాంట్రాక్టర్ల కోసమే పనులు చేశారు కానీ ప్రజల కోసం కాదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తాం. వంశధార వరకూ పోలవరానికి అనుసంధానం చేస్తాం. సముద్రంలోకి పోయే నీరు సీమకు తీసుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు. నాడు మేము ఏడు నెలల్లో గొల్లపల్లి పూర్తి చేయడంతో కియా పరిశ్రమ వచ్చింది. అనంతపురం అంటే ఎడారి అంటారు. దేశంలో తక్కువ వర్షపాతం ఉండే అనంతపురం జిల్లా నేడు రాష్ట్రంలోనే ఆర్థిక వ్యవస్థలో ఐదో జిల్లాగా నిలిచింది. సీమ హార్టికల్చర్ హబ్‌గా తయారైంది. పోలవరం `బనకచర్ల అనుసంధానంతో సీమలో కరువనే మాట వినబడదు. నీటి భద్రత లభిస్తుంది. ఇందుకోసం రూ.80 వేల కోట్లు వ్యయమవుతుంది. కేంద్ర సాయంతో అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళతాం.
గత ఐదేళ్లలో రైతులు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 24 గంటల్లోనే రైతులకు రూ.7,522 కోట్లు చెల్లించి… 32 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. ఏ రైతుకూ మోసం జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఆక్వా రైతులను ఆదుకుంటాం. మైక్రో ఇరిగేషన్ ఇచ్చి రైతులకు చేయూత అందిస్తాం. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. రైతుల పండిరచే పంటకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాం. సీమలో టమాటా రైతును ఆదుకుంటాం.
3 నెలల్లో రోడ్లు వేశాం. మార్చిలోగా రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు వేస్తాం. జాతీయ రహదారుల కింద రూ.55 వేల కోట్లు, రైల్వేల కోసం రూ.75 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనకు తీరప్రాంతం వరం. పోర్టులు వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి. లాజిస్టిక్ హబ్‌గా రాష్ట్రం తయావుతుంది. విజయవాడ, విశాఖ మెట్రో డీపీఆర్‌లు తయారయ్యాయి. ఈ రెండూ పూర్తిచేస్తాం. చెప్పిన మాట ప్రకారం కరెంటు చార్జీలు పెంచలేదు. గత ప్రభుత్వంలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఒక్క పవర్ సెక్టార్‌లోనే రూ.లక్షా 10 వేల అప్పులు చేశారు. ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా చేశారు. నేను 1995 నుంచి పవర్ సెక్టార్‌పై దృష్టి పెట్టేవాణ్ణి. వేసవి వచ్చిందంటే అసెంబ్లీలో కరెంటు పైనే చర్చ జరిగేది. దేశంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి రెగ్యులేటరీ కమిషన్ పెట్టింది టీడీపీ ప్రభుత్వమే. క్లీన్, గ్రీన్ ఎనర్జీగా హబ్‌గా ఏపీని తయారుచేస్తాం. పీఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటిపై సోలార్ ప్లానల్స్ అమర్చుతున్నాం.
ప్రతి నెలా 3వ శనివారం స్వచ్చాంధ్ర చేపట్టాం. పంచాయతీ మంత్రి పవన్ కల్యాణ్‌ని అభినందిస్తున్నాను. పల్లె పండుగ కింద అన్ని పనులు ఒక్కరోజే మంజూరు చేసిన ఘనత ఏపీకే దక్కింది. పంచాయతీల పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పనికీ టెక్నాలజీ అవసరం. 1995లో నేను ఐటీ అంటే 420 అనేవారు. 95లో ఐటీ… 2025లో ఏఐ. వాట్సాప్ గవర్నెన్స్‌తో 160 పౌర సేవలు అందిస్తున్నాము. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలో గంజాయి అనే మాట వినడానికి వీల్లేదు. ఈగల్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజవుతుంది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం. దీనిపైనా దృష్టి పెడతాం. ఎక్కడ తప్పు జరిగినా చూస్తూ ఊరుకోం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన చేస్తాం. ఇప్పటికే ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. క్యూ ఆర్ కోడ్ పెట్టాం. ఎన్ని అడ్బంకులున్నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా నడుపుతాం. ఇందుకోసం అందరం కలిసి పనిచేయాలి. ప్రజాసహకారం కావాలి. ఇప్పటికైనా అవతలి పార్టీ బాధ్యతగా వ్యవహరించాలి. ఇటీవల బీసీలకు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. రూ.896 కోట్లు నిధులు విడుదల చేశాం. మత్స్యకారులను దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు ఇవ్వాలని, అమృత్ పథకం ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి నీరివ్వాలని ప్రధాని ఆలోచించారు. ఇందుకోసం కేంద్రం నిధులిస్తే వాటినీ ఖర్చు చేయలేదు. జల్ జీవన్ కోసం రూ.80 వేల కోట్లు కావాల్సి ఉంటే… గత ప్రభుత్వం కేవలం రూ.20 వేల కోట్లు అడిగింది. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి సాధ్యం. దేశంలో తలసరి ఆదాయంలో హైదరాబాద్ నెంబర్ వన్‌గా ఉందని చంద్రబాబు వివరించారు.
గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాలు లేవు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అమరావతిని స్మశానం చేశామని ఆనందపడ్డారు. పోలవరం నిర్వీర్యం చేసి డయాఫ్రం వాల్‌ను గోదావరిలో కలిపేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రశ్నార్థకం చేశారు. రైల్వే జోన్ కోసం కనీసం స్థలం కూడా ఇవ్వలేదు. నేను గర్వంగా చెబుతున్నా… 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ నాలుగు పనులనూ సాధ్యం చేశాము. ఇందుకు ప్రధాని మోదీ సహకారం మరువలేనిది. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. ఢల్లీిలో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలు. ఢల్లీిలో ఉండలేము రాజధాని మార్చాలని చాలామంది అంటున్నారు. యమునా నది పరిస్థితి దయనీయం. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఢల్లీిలో మనం గర్వపడే రాజధానిని తయారు చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తయారుచేశారు. 2028- 2029 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047నాటికి మన దేశం ఒకటీ లేదా రెండో స్థానానికి చేరుతుంది. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా నెంబర్ వన్‌గా ఉండాలన్నది మా సంకల్పం. ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. ఒక విజన్‌తో ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ. పేదరికం లేని సమాజమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు.