అమరావతి (చైతన్యరథం): ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 3,354 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ నెట్ వసూళ్లు 12.6 శాతం పెరగటం విశేషం. జీఎస్టీ చట్టం వచ్చినప్పటినుంచి ఇంత భారీ మొత్తం ఎప్పుడూ రాలేదు. ఇది కేవలం పన్నుల శాఖ పనితీరుకు నిదర్శనం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కొంచెం నెమ్మదించినట్లు కనిపించినా, 2025 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఏప్రిల్ నెలలో అయితే ఏకంగా రికార్డులనే బద్దలు కొట్టింది. ఇది ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి. పన్నుల ఆదాయం ఇలా పెరుగుతూ పోతుంటే, రాష్ట్రం ఆర్థికంగా మరింత శక్తివంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.