` పరీక్ష వాయిదాకు ఏపీపీఎస్సీ తిరస్కృతి
` అభ్యర్థుల ఆందోళనలు పట్టించుకోని వైనం
అమరావతి (చైతన్యరథం): గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) స్పష్టత ఇచ్చింది. గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్‌లను ఎపీపీఎస్సీ పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక లేఖను కూడా పట్టించుకోలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున.. గ్రాడ్యుయేట్లకు మేలు చేసేలా చేసిన సూచనను తాము పాటించలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ముందు ప్రకటించిన మేరకే ఆదివారం.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధ్రువీకరించారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా..92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు.
రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంది. 23న నిర్వహించాల్సిన పరీక్షను కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ అంశం కోర్టులో ఉంది.. వచ్చే నెల 11న హైకోర్టులో మరో మారు విచారణ జరగనుంది.. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ, ఏపీపీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షా కేంద్రాలు, సమయాలు, ఇతర వివరాలను అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లలో చూసుకోవాలని కమిషన్ తెలిపింది.
అభ్యర్థులకు సూచన..
గ్రూప్ 2 పరీక్షలు ఏపీ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లలో ఉన్న సమాచారం ఆధారంగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి చేరుకోవాలని, అవసరమైన పత్రాలను కూడా తీసుకురావాలని కమిషన్ ఈ సందర్భంగా సూచించింది. ఏపీపీఎస్సీ అభ్యర్థుల పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలైనా ఉంటే, వారు కమిషన్ అధికారిక నంబర్ లేదా ఇ`మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల కోసం అభ్యర్థులు తమ సన్నాహాలను పూర్తి చేసుకోవాలని కమిషన్ సూచనలు జారీ చేసింది. పరీక్షకు హాజరయ్యే సమయంలో నిబంధనలను పాటించాలని సూచించింది. మరోవైపు ఏపీపీఎస్సీ ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది.
అభ్యర్థుల ఆందోళన..
కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా.. పరీక్షలను నిలిపి వేయడాన్ని నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. 2023 డిసెంబరు 7వ తేదీన ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని తెలిపారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి, 23న జరగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.