- కాట్రేనిపాడు, గొల్లగూడెంలలో మంత్రి కొలుసు పర్యటన
ముసునూరు (చైతన్య రథం): కాట్రేనిపాడు గ్రామంలో ఆదివారం ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి గ్రామంలోని ప్రతీవారిని ఆప్యాయంగా పలకరించి, వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదివారం గ్రామంలోని కొంతమంది వృద్ధులు తాము పేదరికంలో ఉన్నామని, తనకు సొంత ఇల్లు లేదని, తనకు ఇల్లు మంజూరు చేయాలనీ కోరారు. తక్షణమే పరిశీలించి ఇంటిస్థలం మంజూరు చేయాలని రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమకు గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు స్థలాలు మంజూరు చేశారని, వాటిల్లో కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారని, కొంతమంది ఇల్లు ప్రారంభదశలో ఉండగా, తదనంతరం వచ్చిన వైసీపీ నేతలు ఇళ్లకు బిల్లులు చెల్లించలేదని, ప్రారంభదశలో ఉన్న ఇళ్లనూ పూర్తి చేయనివ్వలేదన్నారు.
తమ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ సమస్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉందని, తాను సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, సదరు బిల్లులు చెల్లింపులకు, ప్రారంభ దశలోవున్న ఇళ్లకు కొత్త ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గ్రామంలో సొంత ఇల్లులేని పేదల వివరాలు తనకు సమర్పించాలన్నారు. 2025, మార్చి తరవాత కేంద్రం పేదల ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.4 లక్షలకు పెంచుతుందని, ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. గ్రామలో గొల్లగూడెంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరగా రూ.20 లక్షలతో త్వరలో యాదవులు బజారులో మంచి కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరికొంతమంది పెద్ద చెరువు పూడికలు తీయమని అడగగా తక్షణమే పూడిక పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు. గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా పాడైందని, మరమ్మత్తులు చేపట్టాలని కోరడంతో తక్షణమే రూ.40 లక్షల నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని సంబధిత అధికారిని ఆదేశించారు. పింఛను రావడం లేదంటూ కొందరు వృద్దులు మంత్రి దృష్టికి తేవడంతో.. అర్హులందరికీ పింఛను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి భాగస్వామ్యపక్ష నేతలు పాల్గొన్నారు.