- గ్రామ, వార్డు సచివాలయాలు బలోపేతం
- ఔట్‌సోర్సింగ్, డిప్యూటేషన్‌పై 2778 పోస్టులు
- అధికారిక భాష కమిషన్ పేరు మార్పు
- మండలి వెంకట కృష్ణారావు పేరిట నామకరణం
- పర్యాటక ప్రాజెక్టులకు భూకేటాయింపులు
- సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపులు
- కేపిటల్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనకు ఓకే
- రూ.904 కోట్లకు పరిపాలనా ఆమోదం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
- 33 అజెండా అంశాలకు మంత్రిమండలి క్లియరెన్స్
- వివరాలు వెల్లడిరచిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశమైంది. సమావేశంలో 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైకింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 2,778 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారిక భాష కమిషన్ పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్’గా మార్పునకు ఆమోదం తెలిపింది. అజెండాలోని 33 అంశాలపై చర్చించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు.
ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం (4.0) 2025-30 ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు, సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుంచి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా దేశంలోనే మొదటిసారి ఈ పాలసీని మంత్రిమండలి ఆమోదించింది. చెత్తను రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయం పొందడమనేది ప్రభుత్వ లక్ష్యం. ఇక, పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించింది. టూరిజంవల్ల ఉపాధి అవకాశంతోపాటు ఆదాయం చేకూరుతుందని, టూరిజం ప్రాజెక్టులు డెవలప్‌మెంట్ చేయాలనుకుంటే ఇన్సెంటివ్‌లు ల్యాండ్ అలాట్‌మెంట్‌కు కేబినెట్ అంగీకరించిందని మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. పెద్ద ప్రాజెక్టులు అయితే రెండేళ్లలో పూర్తిచేయాలని, జాప్యాన్ని నివారించాలని పేర్కొన్నారు. భూమి కేటాయించిన మూడు నెలల్లోనే ప్రాజెక్టును ప్రారంభించాలనే నిబంధనలు మార్గదర్శకాలలో చోటు చేసుకున్నాయని, అసాధారణ డిలే ఉంటే అవసరమైతే ప్రభుత్వం వాటిని రద్దు చేయొచ్చని మంత్రి వివరించారు.
అలాగే, అధికార భాషా కమిషన్ పేరును ‘‘మండలి వెంకట కృష్ణరావు అధికార భాషా కమిషన్’’గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మండలి వెంకట కృష్ణరావు కమిషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. దాని లక్ష్యాలను రూపొందించడంలో, విధాన దిశను అందించడంలో కీలక పాత్ర పోషించారు. అధికారిక భాషా కమిషన్ స్థాపనలో ఆయన పాత్ర, తెలుగు భాషకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఇటీవల తుమ్మలపల్లి కలాక్షేత్రంలో జరిగిన మండలి వెంకట కృష్ణరావు శతజయంతి వేడుకల్లో అధికారిక భాషా కమిషన్‌ను ‘‘మండలి వెంకట కృష్ణరావు అధికారిక భాషా కమిషన్’’గా మార్చనున్నట్లు ప్రకటించారు. సీపం ప్రకటనకు వాస్తవ రూపం కల్పిస్తూ వెంకట కృష్ణారావు గౌరవార్థం కమిషన్‌కు ఆయన పేరు పెట్టినట్టు మంత్రి వివరించారు. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూమార్పిడి జరిగినచోట వచ్చిన డెవలప్‌మెంట్ ఫీజును అక్కడే వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రంలో ప్రధాన ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు ఒక వ్యవస్థీకృత విధానం ఏర్పడి, పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రాంతీయ పార్కులు, ఇతర నగర సౌకర్యాల అభివృద్ధికి మార్గమేర్పడుతుందని మంత్రి పార్థసారథి వివరించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ.1000 చొప్పున అద్దెకు ముందుగా 33 ఏళ్లకు ఇవ్వడానికి.. అవసరాన్ని బట్టి 99 సంవత్సరాలకు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్ వన్ బిడ్డర్‌లకు 43, 44 ప్యాకెజీలు అప్పగింతకు కేబినెట్ ఆమోదించింది. ఈ ఆమోదం వల్ల అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యేందుకు, మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ 29గ్రామాల్లో ‘‘అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన’’ కింద రూ.904 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం లభించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం అమరావతిలో ప్రపంచస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకై చేస్తున్న స్థల సేకరణ, అభ్యున్నతి, మౌలిక వసతుల కల్పనకు, విద్యావ్యాప్తికి ఉపకరిస్తుంది. విట్, ఎస్‌ఆర్‌ఎంలకు 100 ఎకరాలు చొప్పున రెండు యూనివర్సిటీల ఎక్స్‌టెన్షన్ కోసం భూములు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి ఎకరా రూ.2 కోట్లు చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయాల శాఖలో నామకరణాల మార్పు, వారి డిజిగ్నేషన్ మార్పునకు కేబినెట్‌లో ఆమోదం లభించింది. గత జగన్ ప్రభుత్వం 10, 11 కూర్పుతో ఏర్పాటు చేసింది. అయితే స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటంతో ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో కూటమి ప్రభుత్వం త్రీ స్ట్రైర్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే, 2,778 మందికి డిప్యూటేషన్ లేదా అపాయింట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం లభించింది. ఐఎంఎఫ్‌ఎల్, బీర్, వైన్, ఆర్టీడీ, విదేశీ మద్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధరల నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రాథమిక ధరల ఆమోదాలలో గణనీయమైన అసమానతలు గుర్తించారు. దీనివల్ల ఆదాయ నష్టపోవడమే కాకుండా, ధరల సమగ్రత క్షీణించే అవకాశముంది. ధరల వ్యత్యాసాలు ఆదాయ సేకరణకు ఆటంకం కలిగించాయి. అక్రమాలకు అవకాశం కల్పించడమే కాకుండా.. సరఫరా గొలుసు సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. గత వైసీపీ ప్రభుత్వం క్వాలిటీ లేని లిక్కర్‌ను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ లిక్కర్ నిర్ణయానికి ఆమోదం లభించింది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులను మంత్రిమండలి ఆమోదించింది. మ్యాన్యువల్ స్కావేంజర్స్ నియామకాన్ని నిషేధించి వారికి పునరావాసం కల్పించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. చిత్తూరులోని 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అదనంగా 56 పోస్టులతో అప్‌గ్రేడ్‌కు మంత్రిమండలి ఓకె చెప్పింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చేందుకు డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. తోట వెంకటాచలం (కాకినాడ) లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు, అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు కేటాయింపు, నాలా పన్ను 4 శాతంలో 70 శాతం స్థానిక సంస్థలకు, 30 శాతం అథారిటీలకు ఇవ్వాలని మంత్రిమండలి ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానాన్ని (2024-29) సవరించడానికి మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆధారంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఇన్‌స్టాలేషన్‌కు ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటువల్ల ఏపీ దేశంలోనే తొలిసారిగా ఫిజికల్ క్వాంటం కంప్యూటర్ కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది. ఔషధ ఆవిష్కరణ, వ్యవసాయం, పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధస్సు మరియు సైబర్ సెక్యూరిటీవంటి రంగాలలో విప్లవాత్మక సామర్థ్యాలను అందిస్తుంది. విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలు గ్లోబల్ భాగస్వాములతో కలసి అత్యాధునిక పరిశోధనలు చేయగలుగుతాయి. అలాగే కొత్త స్టార్టప్‌లు, పరిశ్రమలు మరియు ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు లభిస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు.