పాలకొల్లు (చైతన్యరథం): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎంఎంకెఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో 429 బూత్‌లో గురువారం మంత్రి రామానాయుడు ఓటు వేశారు. అనంతరం ఆయన నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీల మేలు కలయికను, కూటమి ప్రభుత్వాన్ని పట్టభద్రులు ఏకపక్షంగా సమర్థిస్తున్నట్లుగా ఓటింగ్ సరళిని బట్టి వెల్లడవుతోందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసినా.. సీఎం చంద్రబాబు ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. గతంలో రాష్ట్రం విడిచి వెళ్లిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు కూడా చంద్రబాబు పాలనపై నమ్మకంతో రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీతో పాటు నిరుద్యోగ యువతీ యువకులకు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు.