- జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిశానిర్దేశం
- సాధారణ ఎన్నికల మాదిరిగానే వీటినీ ప్రతిష్టాత్మంగా చూడాలి
- ఏడు నెలల అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టభద్రులకు వివరించాలి
- తీసుకొచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాలపై ప్రచారం చేయాలి
- మెగా డీఎస్సీ ప్రకటన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు, టీచర్ల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలి
అమరావతి (చైతన్యరథం): త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, నాయకులు కృషి చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో సంబంధిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులతో నారా లోకేష్ సమావేశమై పార్టీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇన్ఛార్జి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను లోకేష్ గుర్తుచేశారు. అప్పుడు టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయని, సాధారణ ఎన్నికలో సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాంది అయిందన్నారు. అప్పుడు 8 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయడం, ప్రతి వారం అభ్యర్థులు, పార్టీలో ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన విషయాన్ని మంత్రులకు వివరించారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నమో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధిని వివరించాలి
ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు. జగన్ రెడ్డి పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరించాలి. ఏడు నెలల్లోనే రూ.6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా 4,10,125 మంది యువత రానున్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలి. ఏడేళ్ల తరువాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్యను గాడిన పెట్టేందుకు వీసీల నియామకం, రిక్రూట్మెంట్, తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని లోకేష్ సూచించారు. ఇన్ఛార్జి మంత్రులందరూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.