- ఎవరెన్ని కుట్రలు చేసినా అడ్డుకోలేరు
- ఓటమి ఖాయమని తెలిసే వెన్నుచూపిన వైసీపీ
- మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు వంద శాతం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఉద్ఘాటించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ శాంతి,భద్రతలను సాకుగా చూపిస్తూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదంటూ వైసీపీ నాయకులు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభ్రదతలకు ఎక్కడా విఘాతం కలగడంలేదు, కలగదు కూడా. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి.
పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుకన్య ఫేమ్ అంబటి రాంబాబు, ఇలాంటి మరికొంత మంది వైసీపీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి పచ్చి అబద్ధాలు చెప్పించారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలుత గౌతమ్ రెడ్డిని వైసీపీ ప్రకటించింది. ఈ నెల 6వ తేదీతో ఓటరు నమోదు ప్రక్రియ పూర్తయింది. ఓటర్ల నమోదు తీరు చూశాక ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేమని అర్థమయ్యే పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. ఇందుకు కుంటి సాకులు చెపుతున్నారు. వైసీపీ గెలవకపోయినా.. టీడీపీ అభ్యర్థులు గెలవకూడదనేది జగన్ కుట్రపూరిత ఆలోచన. ఈ మేరకు వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి పోటీ చేయడంలేదని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులతో పాటు తొలుత రంగంలోని దిగిన వైసీపీ ఇప్పుడు వెన్ను చూపడంలో ఆంతర్యం ఏమిటి? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంచి పాలన సాగిస్తుండటంతో టీడీపీ అభ్యర్థులపై ఓటర్లలో సానుకూలత కనిపిస్తోంది. దీంతో టీడీపీ గెలుపు ఖాయమని తేలటంతో వైసీపీ నాయకులు భయపడి పోటీనుంచి పారిపోయారని రామకృష్ణ ఎద్దేవా చేశారు.
నిజం ఒప్పుకునే ధైర్యం లేకనే..
జగన్మోహన్ రెడ్డివన్నీ దొంగ మాటలు, అవినీతి కార్యకలాపాలే. జగన్ లాంటి అబద్ధాలకోరు బహుశ ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండరమో. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఇలాకాగా చెప్పుకునే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి పోటీచేసి రెండు వేల మెజార్టీతో గెలిచాడు. పులివెందుల ప్రాంతంలోనూ ఆయనకు మెజారిటీ వచ్చింది. దీన్నిబట్టి సొంత నియోజకవర్గంలోనే జగన్‌కి మద్దతు లేదనేది స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర ఎన్నికల్లో వైసీపీ నాయకులు రూ. 30 కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి రెండో స్థానంలో వచ్చాడు. టీడీపీ ఆలస్యంగా ప్రకటించిన అభ్యర్థి చిరంజీవిరావు 35 వేల మెజార్టీతో గెలిచాడు. వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొంగ ఓట్లను చేర్చుకున్నారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కొంతమంది అధికారుల్ని కడపకు తీసుకెళ్లి చదువురాని నిరుద్యోగుల్ని సైతం ఓటర్లుగా చేర్చడంతోనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఎత్తులు పారలేదు. దొంగ ఓట్లు చేర్చినప్పటికీ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన రాం గోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవి రావులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. ఈ గెలుపును జీర్ణించుకోలేక సజ్జల రామకృష్ణ మా ఓటర్లు వేరే ఉన్నారని ఏదేదో మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఓటమి ఖాయమని అర్థమయ్యే పోటీ నుంచి విరమించుకున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓటర్లందరూ ఉన్నారు. మీలో నిజాయితీ ఉంటే అబద్ధాలాడొద్దు. కుట్రలు చేయొద్దు. నిజంగా ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పే ధైర్యం, దమ్ము లేవు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేది టీడీపీ అనడం జగన్ అవివేకం. ఎమ్మెల్సీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎన్నికల సంఘం వైసీపీని రద్దు చేయాలి. మీరు అధికారంలో ఉండి ఎన్ని కుట్రలు చేసినా, కొందరు పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినా 2023 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని రామకృష్ణ గుర్తు చేశారు.
2029లోనూ వైసీపీ ఓటమి ఖాయం
ఎన్నికల్లో ఓడిపోతామని ఈవీఎంలను పగలగొట్టించిన చరిత్ర వైసీపీ నాయకులది. జగన్, పేర్ని నాని, ఇతర వైసీపీ నాయకులు కళ్లు తెరవాలి. 2029 ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకులు కచ్చితంగా ఓడిపోతారు. సీఎం చంద్రబాబు నాయకత్వాన ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. చంద్రబాబు టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చి 10 వేల ఉద్యోగాలు ఇప్పించబోతున్నారు. జగన్ బెదిరించి, పారిపోయేలా చేసిన లులూ కంపెనీ మళ్లీ వస్తోంది. మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి అనేక ఐటీ కంపెనీలను తీసుకొస్తున్నారు. అనేక పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి రావటంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తవుతాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కచ్చితంగా ప్రజలకు మంచి చేస్తుంది. ప్రజల బాగు కోసం నిత్యం శ్రమిస్తుంది. కూటమి అభ్యర్థులైన కృష్ణా, గుంటూరు అభ్యర్థి రాజేంద్రప్రసాద్, గోదావరి జిల్లాల నుండి రాజశేఖర్‌లు ఘన విజయం సాధిస్తారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఎన్జీవోలు, మహిళలు, యువకులు అందరూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. విజయవాడకు వరదలొచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎలా స్పందించిందో అందరూ చూశారు. ఇలా ఇది మంచి ప్రభుత్వం అనడానికి అనేక నిదర్శనాలున్నాయని రామకృష్ణ వివరించారు.