- బుక్కపట్నం చెరువులో బోటింగ్ ప్రారంభించిన మంత్రి
- త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్‌లోనూ బోటింగ్ సౌకర్యం
బుక్కపట్నం (చైతన్యరథం): శ్రీసత్యసాయి జిల్లాలో టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని మండల కేంద్రం బుక్కపట్నం చెరువులో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఉమ్మడి అనంతపురం జిల్లా టూరిజం అధికారి జయకుమార్, తదితరులు పాల్గొన్నారు. బుక్కపట్నం చెరువులో బోటింగ్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లాలో పర్యాటక అభివృద్ధి పై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
జిల్లాలో లేపాక్షి, ప్రశాంతి నిలయం, తిమ్మమ్మ మర్రిమాను సహా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో అతిపెద్దదైన బుక్కపట్నం చెరువు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది పర్యాటకులను ఆకట్టుకునేలా బుక్కపట్నం చెరువులో బోటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సాయి ఆక్వా బోటింగ్ ఆధ్వర్యంలో 14 సీట్ల కలిగిన బోటుతో పాటు 4 పెడల్ బోట్లు, రిస్కీ బోటు ఒకటి నడుపుతున్నట్లు తెలిపారు. త్వరలో బుక్కపట్నం చెరువు వద్ద ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సెలవు రోజుల్లో, పండగ దినాల్లో కుటుంబంతో బుక్కపట్నం చెరువులో బోటింగ్ చేస్తూ సేదతీరవొచ్చునని మంత్రి సవిత తెలిపారు.
త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లోనూ
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పెనుకొండ మండలంలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్‌లోనూ బోటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. ఫుడ్ కోర్టుతో పాటు చిల్డ్రన్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. జిల్లాకు పెరుగుతున్న సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని లేపాక్షిలో వసతి కోసం రూమ్ ల సంఖ్య పెంచడంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామన్నారు. ఈ నెల 23న సత్యసాయి బాబా జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు
మంత్రి సవిత వెల్లడిరచారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, యోగి వేమన మెమోరియల్, తిమ్మమ్మ మర్రిమాను, లేపాక్షి, తదితర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాయన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం చెరువు వద్ద పర్యాటకులను మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటకు టూరిజం ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజినల్ కోఆర్డినేటర్ ఎన్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.