- గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం
- శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలి
- ప్రొబేషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలతో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): నేరాల నియంత్రణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, గత ఐదేళ్లూ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా వున్న ఏఎస్పీలు, డీఎస్పీలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. వారితో జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. గతంలో రౌడీలు రాజకీయ పార్టీల్లోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావు. కానీ నేడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారు. మొన్నటివరకు సోషల్ మీడియాలో ప్రత్యర్థులను-వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇప్పుడు నియంత్రిస్తున్నాం.
గత ఐదేళ్లలో కొందరు కళంకిత పోలీసు అధికారులు కూడా ఇష్టారీతిన వ్యవహరించి వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారు. పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి గత ప్రభుత్వం ఉపయోగించుకుంది. గంజాయి, డ్రగ్స్‌కు నిలయంగా రాష్ట్రాన్ని మార్చేసింది. రాష్ట్రం నుంచే అన్ని చోట్లకు పంపిణీ జరిగేది. దీంతో నేరాల సంఖ్య పెరిగిపోయింది. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడంపైనా దృష్టిపెట్టాం. మీరు కూడా ఎక్కడా విధుల్లో రాజీ పడొద్దు. గంజాయి రవాణా, బెల్ట్ షాపులు నిర్వహణ, ఇసుక అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేయండి
సైబర్ నేరగాళ్లు కూడా రానున్న రోజుల్లో మీకు సవాల్ గా మారతారు. వారికంటే మెరుగ్గా ఆలోచించినప్పుడే నేరాలను అరికట్టగలుగుతారు. నేరస్థులకు మీరు ఎక్కడా అవకాశం ఇవ్వొద్దు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాలు వస్తాయి. నా అంచనాలకు అనుగుణంగా మీరు పని చేయాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలి. గతంలో పోలీసులకు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాం. బాడీ ఓర్న్ కెమెరాలు, సీసీ కెమెరాలు, వంటి పరికరాలు తెచ్చాం. తద్వారా నేరస్థులను గుర్తించడంతో నేరాల సంఖ్య తగ్గింది. కానీ గత ఐదేళ్లూ వాటిని నిర్వీర్యం చేశారు. మహిళలు, చిన్నారులపై కొందరు మానవత్వం మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. అసాంఘిక కార్యకలపాలను కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు.