ముప్పాళ్ల/ నందిగామ (చైతన్య రథం): బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో శనివారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమం సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్‌సీ కార్పొరేషన్, విభిన్న ప్రతిభావంతుల శాఖ తదితర శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఎస్‌సీ కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన సెర్ప్-ఉన్నతి వడ్డీలేని రుణాల మంజూరుకు సంబంధించిన స్టాల్‌ను సందర్శించి.. మహిళలతో మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన పదిమంది లబ్ధిదారులకు రూ.3,40,200 విలువైన ఉపకరణాలు అందించారు. ఒక్కో ట్రై సైకిల్ రూ.60 వేలు కాగా.. రూ.1,80,000 విలువైన మూడు బ్యాటరీ ట్రై సైకిళ్లను లబ్ధిదారులకు అందజేశారు. డిగ్రీ కోర్సులు చేస్తున్న నలుగురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కటి రూ.35 వేలు విలువైన ల్యాప్‌ట్యాప్‌లను అందజేశారు. ఒక్కొక్కటి రూ.8,500 విలువైన రెండు వీల్‌ఛైర్‌లను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా రూ.3,200 విలువైన వినికిడి యంత్రాన్ని లబ్ధిదారునికి అందించారు.