- రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ ఉండాలి
- పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.24 కోట్లతో అంచనాలు
- సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
- 33 మందికి రూ.34.77 లక్షల చెక్కులు అందజేత
అద్దంకి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలోని 33 మంది లబ్ధిదారులకు రూ. 34.77 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శుక్రవారం చిలకలూరిపేట లోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే .. మరో పక్క గుండె, కేన్సర్, కిడ్నీ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా సకాలంలో సీఎంఆర్‌ఎఫ్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. అంతే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ఆపరేషన్ల నిమిత్తం సమయానికి ఎల్‌ఓసీలు అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వమని పేర్కొన్నారు.
రోడ్ల పనుల పరిశీలన
అనంతరం అద్దంకి పరిధిలో జరిగే బీటీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్ల నిర్మాణం, నాణ్యత విషయంలో అధికారుల పర్యవేక్షణ తప్పక ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు రోడ్ల నాణ్యత పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దమ్ము చక్రాల వాహనాల వలన రోడ్లు ధ్వంసం అవుతున్నాయని అన్నారు. ఈ విషయంలో సంబంధిత ప్రాంత ప్రజలే బాధ్యతగా తీసుకుని వాహనాల రాకపోకలను కట్టడి చేయాలని కోరారు. తమ ప్రాంత రోడ్లు బాగుండాలంటే దమ్ము చక్రాల వాహనాలను రోడ్లపైకి అనుమతించకుండా అధికారులతో పాటు స్థానికులు కూడా చూడాలన్నారు. అదే విధంగా పంచాయితీరాజ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి సుమారు రూ.24 కోట్లతో అంచనాలు రూపొందించి నిధుల కోసం సంబంధిత శాఖకు పంపామని మంత్రి గొట్టిపాటి వెల్లడిరచారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.