- నవ్యాంధ్ర సాంకేతిక రంగంలో నూతన అధ్యాయం
- రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమైన మైలురాయి
- టెక్నాలజీలో కొత్త శక్తి కేంద్రంగా ఆవిర్భవించనున్న విశాఖ
- ఏడాది నిరంతర కృషితో గూగుల్ని రప్పించిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): గూగుల్ క్లౌడ్ రాకతో ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక విప్లవం ప్రారంభం కానుంది. నవ్యాంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ క్లౌడ్ రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడితో, 2 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. ఇది కేవలం పెట్టుబడి కాదు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు బలమైన పునాది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి ఫలితంగా ఈ అద్భుతమైన గ్లోబల్ పెట్టుబడి సాధ్యమైంది. 12 నెలల నిరంతర కృషితో, జాతీయ విధానాల్లో మార్పులు చేయించి రాష్ట్రానికి ఈ అవకాశాన్ని తీసుకురావడం మంత్రి లోకేష్ నాయకత్వం, సమర్థతకు నిదర్శనం. మంత్రి నారా లోకేష్ ఎంతో ముందు చూపుతో.. గత అక్టోబర్లో అమెరికాలోని గూగుల్ హెడ్ ఆఫీసును సందర్శించి వారి ఏఐ హబ్ ప్రణాళికలకు తగ్గట్లుగా ఏపీ వద్ద ఉన్న సౌకర్యాలు, విశాఖ సానుకూలత అంశాలను వివరించి.. ఆ తర్వాత ఏడాది పాటు ఫాలో అప్ చేసి.. పెట్టుబడులను సాకారం చేశారు. అనేక అంశాల విషయంలో ఆ సంస్థను ఒప్పించి.. మెప్పించిన ఘనత పూర్తిగా మంత్రి నారా లోకేష్క దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద, దేశంలో తొలి ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటు కానుండటం ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ టెక్ మ్యాప్ పై నిలబెట్టబోతోంది.
విశాఖలో ఏర్పడబోయే సబ్ సీ కేబుల్ నెట్వర్క్ అంతర్జాతీయ కనెక్టివిటీకి నూతన గమ్యం కానుంది. వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలపై దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేస్తుంది. హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ రాకతో దేశానికి టెక్ హబ్ మారినట్లుగానే.. విశాఖలో గూగుల్ క్లౌడ్ రాకతో ఆంధ్రప్రదేశ్ భారత టెక్నాలజీకి నూతన శక్తి కేంద్రంగా నిలవబోతుంది. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి గర్వకారణమైన మైలురాయి. ప్రపంచం నేడు “సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం” వైపు చూడటానికి ఇదే కారణం. ఈ చారిత్రాత్మక అడుగు -భవిష్యత్ తరాలకు ఆశ, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం నింపే డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపు తొలి అడుగు. ఇండస్ట్రీ వర్గాలు, ఐటీ వర్గాలు, ప్రభుత్వాలు, రాజకీయాల నేతల మధ్య ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దేశంలో మొట్టమొదటి ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటుకు ఒప్పందాలు జరగడం.. ఐదేళ్ల వ్యవధిలోనే 15 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడం గేమ్ ఛేంజర్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ అంశంపై అన్ని రంగాల్లోనూ నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏఐ సూపర్ పవర్గా ఇండియా మారే అంశంలో .. మొదటి అడుగు ఘనంగా పడిందని చెబుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ తెలుగు వారి చరిత్రను మలుపు తిప్పింది. ఇప్పుడు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ దానికి పదిరెట్లు శక్తివంతమైనది. గూగుల్ పెట్టుబడుల వల్ల విశాఖలో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. దిగ్గజ కంపెనీలు, స్టార్టప్లు వస్తాయి.. ప్రపంచస్థాయి కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్ఫూర్తి కొనసాగితే.. ముంబైతోనే విశాఖ పోటీ పడుతుందని.. దేశ ఉపాధి కేంద్రంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.