- ఫలించిన సీఎం చంద్రబాబు కృషి
- మిర్చి మద్దతు ధరను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ: ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ శుభవార్త చెప్పింది. క్వింటా మిర్చికి రూ.11,781 ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ మద్దతు ధర ప్రకటించింది. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తోనూ మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఆ సమయంలోనూ మిర్చి రైతుల సమస్యలను కేంద్రం వద్ద ప్రస్తావించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లి.. అప్పటికప్పుడే ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇప్పించారు.
ఆ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల వేతలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు మిర్చి రైతులకు మేలు జరిగేలా కృషి చేయాల్సిన బాధ్యతనూ అప్పగించారు. అదేవిధంగా రైతులకు ధైర్యం చెప్పేందుకు గత శనివారమే మిరప రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సుదీర్ఘంగా సుమారు 4 గంటలపాటు సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ధరలపై మిరప రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో భరోసానిచ్చారు. మార్కెట్ జోక్యం పథకం (ఎంఐఎస్) కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని, నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం అందించాలన్నదే తమ తాపత్రయమని ఆ సమావేశంలో స్పష్టం చేశారు. మిర్చి సాగు, పెట్టుబడి ఖర్చులు, ఎగుమతులపై సమగ్ర వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు, క్వింటాలు మిర్చి ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ జోక్యం కింద కొనుగోలుకు కేంద్రం అనుమతించిందని, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించి రైతుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అదే సమావేశంలో రైతుల సందేహాలను చంద్రబాబు నివృత్తి చేశారు. ‘మార్కెట్లో అమ్ముకునే మిర్చికి మాత్రమే ఎంఐఎస్‌ను వర్తింపజేస్తే, ‘మీకు ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కదా’ అని వ్యాపారులు ధరలు ఇంకా తగ్గిస్తారని రైతులు ముఖ్యమంత్రి వద్ద భయాందోళన వ్యక్తం చేశారు. ‘గ్రామాల్లో రైతుల నుంచి దళారులే కొని, మార్కెట్లో అమ్ముకుంటారు. తద్వారా ప్రభుత్వ సాయం వారికే అందుతుంది. ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఇక్కడి మార్కెట్లకు మిర్చి తెస్తారు. రాష్ట్ర రైతులకు న్యాయం జరగదు. వ్యవసాయశాఖ ఈ-క్రాప్ ఆధారంగా సాగుదారులు, పంట విస్తీర్ణాన్ని పరిశీలించి ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లెక్కన సాయం అందించేలా చూడండ’ని రైతులు కోరారు. ఈ-క్రాప్‌లో నమోదై, మార్కెట్లో అమ్ముకున్న రైతుల వివరాలు పరిశీలించి, ఆ మేరకు సాయం చేయడాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మార్కెట్లో అమ్మకాలకే ఈ పథకం వర్తిస్తుందని, ఈ-క్రాప్ ద్వారా సాయం చేయడంపై కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మిర్చి రైతుకు భరోసా ఇచ్చినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషితో.. తాజాగా కేంద్రం మిర్చికి ధరను ప్రకటించింది.