- జేఈఈ మెయిన్స్‌లో అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల ప్రతిభ
- ఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించిన 110మంది విద్యార్థులు
- మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు
అమరావతి (చైతన్య రథం): జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించిన బీఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రత్యేకంగా విద్యార్దులకు జేఈఈకి ఉచితంగా ప్రభుత్వం శిక్షణిస్తోంది. ఈ మూడు పాఠశాల్లలో మొత్తం 190మంది విద్యార్దులు శిక్షణపొందగా అందులో 110 మంది అడ్వాన్స్‌కి అర్హత సాధించారు. 11మంది విద్యార్దులు 90కి పైగా పర్సంటైల్ సాధించారు. చినటేకూరు గురుకుల విద్యార్థి అడపాక నవీన్ 97.61 శాతం పర్సంటైల్ సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ కష్టపడి చదివిన విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన అధ్యాపక సిబ్బందికి అభినందనలు తెలిపారు. వీరి స్పూర్తితో వచ్చే ఏడాది మరింత విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్ సాధించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యాభోధన అందిస్తున్నామని, విద్యార్థులకు విద్యతోపాటు వారి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టామన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, విద్యకు కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందన్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి డోలా వ్యాఖ్యానించారు.