- రాష్ట్రంలో కొత్తవృద్ధి శకం ఆరంభం
- సీఐఐ సదస్సులో వెల్లువెత్తిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనం
- 2027 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం ప్రారంభయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కనీవినీ ఎరుగని రీతిలో రూ.13.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదరటం ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నేతృత్వంలో తిరిగి పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించటమే కాకుండా, ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయతను పునరుద్ధరించగలిగామన్నారు. చంద్రబాబు దార్శనికతకు, పాలనా దక్షతకు ఇది బలమైన నిదర్శనమన్నారు. మంత్రి లోకేష్ ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటించి, రోడ్ షోలు నిర్వహించి, నిరంతర సంప్రదింపులతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేందుకు బాటలు వేశారన్నారు.
అందువల్లే అసాధారణ రీతిలో పెట్టుబడులు వెల్లువెత్తాయన్నారు. రాష్ట్ర ఆర్థికవృద్ధితో పాటు, యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతరం సాగించిన కృషి ఫలితమే ఈ పెట్టుబడుల వెల్లువ అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, మంత్రి లోకేష్ అవిశ్రాంత, సాంకేతికత ఆధారిత ప్రయత్నాలతో 2047 నాటికి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలు వారిద్దరి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్తవృద్ధి శకం ప్రారంభమయిందని పల్లా స్పష్టం చేశారు.











